కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ కన్నుమూత

13 Nov, 2018 04:17 IST|Sakshi
కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ

కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న బీజేపీ నేత

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

సాక్షి, బెంగళూరు/శివాజీనగర: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల  మం త్రి అనంత్‌ కుమార్‌(59) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి దాటా క 2 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారతంలోని కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావటానికి కృషి చేసిన ముఖ్య నేతల్లో అనంత్‌ కుమార్‌ ఒకరు. దక్షిణ బెంగళూరు నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంత్‌ కుమార్‌కు భార్య డాక్టర్‌ తేజస్వి, కుమార్తెలు ఐశ్వర్య, విజేత ఉన్నారు. సాయంత్రం ప్రధాని మోదీ బెంగళూరుకు వచ్చి అనంత్‌ కుమార్‌ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంత్‌ కుమార్‌ కుటుంబసభ్యులను ఓదార్చారు.  

ఎమర్జెన్సీ సమయంలో జైలుకు..
బెంగళూరుకు చెందిన హెచ్‌.ఎన్‌.నారాయణ్‌ శాస్త్రి, గిరిజ దంపతులకు అనంత్‌ కుమార్‌ 1959లో జన్మించారు. విద్యార్థి దశలోనే  ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అరెస్టై జైలుకు వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1987లో బీజేపీలో చేరారు. 1996లో మొదటిసారిగా దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు. 1998లో వాజపేయి కేబినెట్‌లో 38 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సారథులు వాజ్‌పేయి, అడ్వాణీతోపాటు ప్రధాని మోదీకి సన్నిహితుడిగా అనంత్‌ కుమార్‌కు పేరుంది.  ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో కన్నడలో ప్రసంగించిన మొదటి నేత అనంత్‌కుమారే.  

నేడు అంత్యక్రియలు
బ్రిటన్, అమెరికాల్లో కేన్సర్‌ వ్యాధికి చికిత్స పొందిన అనంత్‌కుమార్‌ అక్టోబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చారు. బెంగళూరులోని శ్రీశంకర కేన్సర్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం చామరాజపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

ప్రముఖుల సంతాపం..
అనంత్‌కుమార్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఎల్‌కే అడ్వాణీ సంతాపం తెలిపారు.  ‘అనంతకుమార్‌ మంచి పరిపాలనాదక్షుడు. యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి అంకితభావంతో పనిచేశారు. కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరులో పార్టీ బలోపేతం అయ్యేందుకు కృషి చేశారు. ఆయన భార్య తేజస్వినితో మాట్లాడాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

గవర్నర్, తెలంగాణ సీఎం సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి అనంత కుమార్‌ మృతికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంత కుమార్‌ మృతి దేశానికి తీరని లోటని గవర్నర్‌ పేర్కొన్నారు. అనంత్‌ కుమార్‌ దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు.   అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్,  బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: అనంత్‌కుమార్‌ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతకుమార్‌ మృతికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కుటుం బ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
 

మరిన్ని వార్తలు