వారిని సంప్రదించే లాక్‌డౌన్‌ పొడిగించాం : కిషన్‌రెడ్డి

2 May, 2020 11:43 IST|Sakshi

వలస కార్మికుల విషయంలో మానవీయ కోణం

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వారందరితో ఏకాభిప్రాయాంకు వచ్చిన తర్వాతే లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించామన్నారు. రెడ్‌జోన్ల ప్రాంతాల్లో ఇకపై లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కొత్తగా పాజిటివ్‌ కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. లాక్‌డౌన్‌లో ప్రజలకు ఇబ్బందులు పడకుండా కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు రూపొందించామని వెల్లడించారు. (లాక్‌డౌన్‌: సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ)

కేసుల తీవ్రతను బట్టి ప్రాంతాలను మూడు జోన్లుగా వర్గీకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక ఆధారంగా జోన్లను గుర్తించామని కిషన్‌రెడ్డి తెలిపారు. రెడ్‌జోన్లో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆయా జోన్లలో ప్రజలకు ప్రభుత్వాలకు, స్థానిక అధికారులకు సహకరించాలని కోరారు. వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.12వేల కోట్లు అందించామని వెల్లడించారు. కూలీల తరలింపు కోసం 300 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2 కోట్ల 22 లక్షల పీపీఈ కిట్లు తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. (17దాకా లాక్‌డౌన్‌.. సడలింపులివే..!)

మరిన్ని వార్తలు