‘నేను 20 - 20 ఆడలేను.. కానీ గిల్లీదండ బాగా ఆడతాను’

25 Sep, 2018 09:13 IST|Sakshi
కేంద్ర మంత్రి, ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుషాహ (ఫైల్‌ఫోటో)

పాట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌లో పొత్తుల చర్చలు ఊపందుకుంటున్నాయి. బీజేపీ, జేడీ(యూ), ఆర్‌ఎల్‌ఎస్‌పీ పార్టీల మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం తీవ్ర రూపం దాల్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి కేంద్ర మంత్రి, ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుషాహ ‘మా పార్టీలో జరిగే విషయాల గురించి మా కంటే ముందు మీకే తెలుస్తున్నాయి. సీట్ల పంపిణీ ఉంటుందా లేదా అనే విషయం గురించి పార్టీల్లో కన్నా మీడియాలోనే ఎక్కువ చర్చ జరుగుతుంది’ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో బిహార్‌లో బీజేపీ 20 - 20 ఫార్మాట్‌ని పాటించబోతుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ సీట్లలో 20 సీట్లు బీజేపీకి, మిగిలిన 20 సీట్లలో 12 నితిష్‌ కుమార్‌ జేడీ(యూ)కి మరో 6 రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ పార్టీకి కేటాయించనున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీని గురించి ఉపేంద్రను ప్రశ్నించగా ఆయన నేను కాస్తా పాత తరం వాడిని.. అందుకే నాకు ఈ 20 - 20 ఫార్మాట్‌ గురించి పూర్తిగా తేలీదు.. అర్థం కూడా కాదు. కానీ నేను గిల్లీ దండ మాత్రం చాలా బాగా ఆడతానంటూ వెరైటీగా స్పందించారు. అంతే కాకుండా సీట్ల పంపిణీ గురించి సదరు పార్టీల్లోకన్నా మీ చానెల్స్‌లోనే ఎక్కువ చర్చ జరుగుతుందన్నారు. వ్యక్తిగతంగా అయితే తనకు సీట్ల పంపకం నచ్చదన్నారు. కానీ పార్టీ నుంచి నిర్ణయం వెలువడే వరకూ తాను ఈ విషయం గురించి ఏం మాట్లడనన్నారు.

మరిన్ని వార్తలు