కేంద్ర మంత్రి భార్య, కుమార్తెపై ప్రశంసలు

8 Apr, 2020 12:30 IST|Sakshi

మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య, కుమార్తె

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో దేశమంతా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది. కరోనా ‘ప్రసాదించిన’ఈ ఖాళీ సమయాన్ని కొంతమంది కుటుంబానికి కేటాయించగా.. మరికొంత మంది తమలోని నైపుణ్యాలకు పదునుపెడుతూ సృజనాత్మకత జోడించి కరోనాపై పాటలు, పద్యాలు, కథలు, కవితల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంకొంత మంది కరోనాపై పోరులో తోటివారిని గెలిపించేందుకు సామాజిక సేవకు నడుం బిగిస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భార్య మృదుల, కుమార్తె నైమిష కూడా ఈ కోవకే చెందుతారు. లాక్‌డౌన్‌ సమయాన్ని వృథా చేయకుండా దర్జీ అవతారమెత్తి మాస్కులు కుడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో మనం చేసే చిన్న సాయానికి కూడా ఎదుటివారి ప్రాణాలు నిలపగల శక్తి ఉంటుందని చాటిచెబుతున్నారు.(రైట్‌ పర్సన్‌కు రాంగ్‌ నంబర్‌)

తన భార్య, కూతురు సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నారంటూ స్వయానా ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ‘‘ నా ఇల్లాలు మృదుల, కుమార్తె నైమిష మా ఇంట్లో వాళ్ల కోసం, ఆపన్నుల కోసం మాస్కులు తయారుచేస్తున్నారు. వాళ్లను చూస్తే గర్వంగా ఉంది. ఆపద సమయాల్లో మా వంతుగా సమాజానికి చిన్నపాటి సేవలు అందిస్తున్నాం. మనలోని నైపుణ్యాలకు పదును పెట్టేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకుతుందా’’అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో మృదుల, నైమిషపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనాపై పోరులో మీ వంతు కృషికి ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. (కరోనా: గొప్పవాడివయ్యా)

కాగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇక మాస్కులు కొనే ఆర్థిక స్థోమత, అవకాశం లేనివాళ్లు ఇంట్లోనే వాటిని తయారు చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా 160 మంది మృత్యువాత పడగా.. 5351 మంది మహమ్మారి బారిన పడ్డారు.


మిజోరాంలో మాస్కులు కుడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు


 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు