ఊడుతున్న ఎర్ర బుగ్గలు

19 Apr, 2017 18:51 IST|Sakshi
ఊడుతున్న ఎర్ర బుగ్గలు

వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఎర్ర బుగ్గలను (సైరన్లను) తొలగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడంతో క్రమంగా ఆ సైరన్లు ఊడుతున్నాయి. మే 1వ తేదీ నుంచి నోటిఫికేషన్‌ అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా, అంతకంటే ముందుగానే కొంతమంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ దిశగా ముందడుగు వేస్తున్నారు. అందరికంటే ముందుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన కారుకు ఉన్న ఎర్రలైటు సైరన్‌ను తీయించేశారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఎర్రలైటు ఉండాలని.. అలాంటప్పుడు తనకు అవసరం లేదు కాబట్టి తన కారు మీద ఉన్న సైరన్‌ను తీయించేశానని ఆయన చెప్పారు.

ఆయన తర్వాత కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, విజయ్ గోయల్ కూడా ఎర్రబుగ్గలను తమ తమ కార్ల నుంచి తీయించేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కేంద్ర మంత్రుల బాటలోనే వెళ్లి.. ఆ సైరన్లను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వాలలో నీలిరంగు సైరన్లను వాడుకోవచ్చన్న నిబంధన కూడా మారబోతోందని, కేవలం ముందుగా నిర్ణయించిన ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఆ సైరన్లు ఉండొచ్చని జైట్లీ చెప్పారు.

మరిన్ని వార్తలు