ఆకలి రాజ్యం అంతం ఎప్పుడు

20 Feb, 2019 02:16 IST|Sakshi

సమస్య గుర్తింపు–నివారణపై దృష్టిపెట్టాలన్న ఐక్యరాజ్యసమితి
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించాలి. పోషకాహార లోపాన్ని నివారించాలి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో ఇవి అతి ముఖ్యమైనవి. అయితే వీటిని సాధించే దిశగా జరుగుతున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఐక్యరాజ్య సమితి వెలువరించిన 2018 ప్రపంచ ఆహార భద్రత – పోషణ స్థితిగతుల నివేదిక వివరిస్తోంది. ఆకలి బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారని, వాతావరణ మార్పులు ఆహార భద్రతను దెబ్బ తీస్తున్నాయని, తీవ్ర కరువులు, వరదలు వచ్చిన దేశాల్లో ఆకలితో ఆలమటించేవారి సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిందని ఈ నివేదిక బహిర్గతం చేసింది. ఆకలిని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు.. ప్రపంచంలో కొన్ని చోట్ల తలెత్తిన సంఘర్షణాత్మక, హింసాయుత వాతావరణం అడ్డంకిగా మారిన విషయాన్ని కూడా నివేదిక పేర్కొంది. శిశువులు, ఐదేళ్ల లోపు పిల్లలు, బడికి వెళ్లే పిల్లలు, కిశోర బాలికలు, స్త్రీలు మొదలైన దుర్బల తరగతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ‘ఆక్స్‌ఫామ్‌’ఆహార – వాతావరణ విధాన విభాగాధినేత రాబిన్‌ విలంగ్‌బీ నివేదికాంశాలపై స్పందిస్తూ.. శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వాలు, రాజకీయవేత్తలు రెట్టింపు కృషి చేయాలని, వాతావరణ సంక్షోభాలు ఎదుర్కొంటున్న పేద దేశాలకు నిధులిచ్చి సాయపడాలని సూచించారు. 

పోషకాలలేమితో అధిక బరువు 
2016 నాటికి ప్రతి ఎనిమిది మంది పెద్దవారిలో ఒకరికి (67.2 కోట్ల మందికి పైగా) స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఆఫ్రికా, ఆసియాల్లో స్థూలకాయులు పెరుగుతున్నారు. భారత్‌లోని ఐదేళ్లలోపు పిల్లల్లో, 18 ఏళ్లు పైబడిన జనాభాలో అధిక బరువున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధిక ధరల కారణంగా పోషకాహారం అందుబాటులో లేకపోవడం, తిండి లేకపోవడం తాలూకూ ఒత్తిళ్లు వంటి అంశాలు కూడా అధిక బరువు, స్థూలకాయానికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులు స్త్రీలలో రక్తహీనతకు, బరువు తక్కువ పిల్లలు పుట్టడానికి, బడికి పోయే బాలికలు బరువు పెరిగేందుకు కారణమవుతున్నాయి. 

పెరిగిన ఎనీమియా బాధితులు
గర్భిణుల్లో తగినంత రక్తం లేకపోతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. కానీ ఈ సమస్యను నివారించడంలో ఏ దేశం కూడా ప్రగతి సాధించలేదని వెల్లడైంది. ప్రతి ముగ్గురు గర్భిణుల్లో ఒకరు రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. 2012 (30.3%)తో పోల్చుకుంటే 2016 నాటికి (32.8శాతం) వీరి సంఖ్య పెరిగింది. ఉత్తర అమెరికాతో పోల్చుకుంటే ఆఫ్రికా, ఆసియాల్లో రక్తహీనత బారిన పడుతున్న స్త్రీలు ఇంచుమించు మూడింతలు ఎక్కువ. 

వాతావరణ విపత్తులు రెట్టింపు
వాతావరణ మార్పులు వ్యవసాయంపై, ఆహార భద్రతపై చూపుతున్న ప్రభావాల్ని నివేదిక వివరించింది. ఆకలిని, పోషకాహారలేమిని తుద ముట్టించే దిశగా సాధిస్తున్న పురోగతిని ఈ మార్పులు సవాల్‌ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. విపరీతమైన వేడి, వరదలు, తుపానులు, కరువులు సహా వివిధ వాతావరణ విపత్తులు 1990 నుంచి రెట్టింపు అయ్యాయి. 1990–2016 మధ్య సగటున ఏడాదికి 213 విపత్తులు విరుచుకుపడ్డాయి. ఆహార ఉత్పత్తిని దెబ్బ తీశాయి. మొత్తం నష్టంలో 80 శాతానికి కరువులే కారణం. 2005 నుంచి తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్న దేశాల్లో పోషకాహార లోపం పెరిగింది. పలు దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో 1996– 2000తో పోలిస్తే.. 2011–2016 మధ్య ప్రకృతి వైపరీత్యాలు పెద్దమొత్తంలో పెరిగాయి. ఇవి దిగుబడులను, గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బ తీయడంతోపాటు ధరల పెరుగుదలకు, వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. దీర్ఘకరువులతో ప్రజలు వలస బాట పడుతున్నారు. పర్యావరణమూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ విపత్తులను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు తగిన కార్యక్రమాలను, విధానాలను రూపొందించుకుని అమలు చేయాలని ఈ నివేదిక నొక్కి చెప్పింది. 

మూడంచెల విధానంతో.. 
ఐదేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపంతో సరైన ఎదుగుదల ఉండటంలేదు. 2017లో ఇలాంటి వారి సంఖ్య 15.1కోట్లు. 2012లో ఇది 16.5 కోట్లు. ప్రపంచ దేశాలు ఈ విషయంలో సాధించిన ప్రగతి చాలా స్వల్పమని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఎదుగుదల సరిగాలేని పిల్లల్లో అత్యధికులు ఆఫ్రికా (39%) ఆసియా (55%) పిల్లలే. ఇలాంటి పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు పెరగని వారు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. వీరిలో ఇంచుమించు సగానికి సగం మంది దక్షిణాసియాకు చెందినవారే. 25% మంది సబ్‌–సహరన్‌ ఆఫ్రికా పిల్లలు. అనారోగ్యం, మరణం బారినపడే ప్రమాదం వీరికి ఎక్కువని నివేదిక హెచ్చరించింది. ఇదే వయసు పిల్లల్లో 3.8కోట్ల మందికి పైగా అధిక బరువుతో వున్నారు. పోషకాహారం అందుబాటులో లేకపోవడం వల్లే.. బరువు తక్కువ పిల్లలు పుట్టేందుకు, వారిలో ఎదుగుదల సమస్యలకు కారణమవుతోందని.. తదనంతర జీవితంలో వీరు అధిక స్థూలకాయం బారిన పడే ప్రమాదముందని నివేదిక వివరించింది. ‘నివారించడం, సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, చికిత్స అందించడం’అనే మూడంచెల విధానం ద్వారా పోషకాల లోపంతో తలెత్తుతున్న ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలని ఆ నివేదిక సూచించింది.  
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు