మన సంస్కృతికి ఇవే మచ్చు తునకలు

15 Nov, 2015 06:13 IST|Sakshi
మన సంస్కృతికి ఇవే మచ్చు తునకలు

న్యూఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిని, భిన్నమతాల వారు ఐకమత్యంతో కలసి ఉండడం భారత్‌లాంటి దేశానికే సాధ్యమైందని లండన్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ గొప్పగా చాటి చెప్పారు. దేశంలో *అసహనం* పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు రాజకీయమే కావచ్చుగాక... నిజంగా మనది భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతని చాటి చెప్పేందుకు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు....
 
 ముస్లిం దంపతుల కొడుకుకు గణేశ్ పేరు
 27 ఏళ్ల ఇలాయజ్ షేక్ ఒకరోజు నిండు చాలాలు అయిన తన భార్య నూర్ జహాన్‌ను డెలివరి కోసం ముంబైలోని ఓ ఆస్పత్రికి కారులో తీసుకెళుతున్నాడు. మార్గమధ్యంలోనే నూర్ జహాన్‌కు నొప్పులు పెరిగాయి. తన కారులో ప్రసవం ఒప్పుకోనంటూ ఆ కారు డ్రైవర్ వారిని బలవంతంగా అక్కడే దించేశారు. ఏం చేయాలో తోచని షేక్ సమీపంలోవున్న గణపతి గుడికి తన భార్యను తీసుకొని వెళ్లాడు. అక్కడున్న హిందూ మహిళలు కొందరు ఆమె పరిస్థితిని గమనించి గుడి స్తంభాలకు అడ్డుగా చీరలు కట్టి నూర్ జహాన్‌కు ప్రసవం చేశారు. అలా పుట్టిన కొడుకును షేక్ దంపతులు గణేశ్ అని నామకరణం చేశారు.


 హిందూ స్నేహితుడికి అంత్యక్రియలు చేసిన ముస్లిం
 ప్రాణాంతక జబ్బుతో అర్ధాంతరంగా కన్నుమూసిన సంతోష్ సింగ్ అనే  మిత్రుడికి రజాక్ ఖాన్ తికారి హిందూ మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం, ఇది సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లో ఇటీవల చోటుచేసుకొంది. పేదవారైన సంతోష్ సింగ్ కుటుంబాన్ని రజాక్ ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.

ఉమ్మడిగా అంత్యక్రియలు
మధ్యప్రదేశ్‌లోని బార్వాని జిల్లా సెంద్వా పట్టణంలో సీతారాం అనే 75 ఏళ్ల వృద్ధుడు ఇటీవల మరణించాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూలేక పోవడంతో స్థానిక హిందువులు, ముస్లింలు కలసి హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

అనుమాన్ ఛాలీసా ఉర్దూలోకి అనువాదం
హిందూ, ముస్లింల ఐక్యతను కోరుకుంటా అబీద్ అల్వీ అనే ముస్లిం యువకుడు హనుమాన్ ఛాలీసాను ఉర్దూలోకి అనవదించారు. ముస్లింల విశ్వాసానికి చెందిన ఉర్దూ పుస్తకాలను హిందీలోకి, హిందువుల గ్రంధాలను ఉర్దూలోకి మార్చాల్సిన అవసరం ఉందని ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన అబీద్ అల్వీ అభిప్రాయపడ్డారు.

గణపతి పందిరిలో ముస్లిం ప్రార్థనలు
ముంబైలోని ఓ మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు చాలినంత చోటు లేకపోవడంతో మసీదు పక్కన వేసిన గణపతి పందిరిలోకి ముస్లింలను హిందూ భక్తులు ఆహ్వానించారు. పక్కన వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి ఉన్నప్పటికీ ముస్లింలు అదే పందిరిలో ప్రార్థనలు జరిపారు.


లూథియానా జైల్లో ఉమ్మడి పండుగలు
లూథియానా జైల్లో ముస్లింలు, హిందువులు, సిక్కులు రంజాన్, దీపావళి, గురుపూరబ్ పండగలు కలసే జరుపుకుంటారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సంఘీభావంగా హిందువులు, సిక్కులు 40 రోజుల పాటు ఉపవాసం చేయగా, ముస్లింలు, సిక్కులు దసరా, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

హిందూ కీర్తనలు ఆలపించే బాబా....
 మహారాష్ర్టలోని బీడ్ నగరానికి చెందిన 73 ఏళ్ల సాయిక్ రియాజొద్దీన్ అబ్దుల్ గనీ హిందూ దేవాలయాల్లో మీరా భక్తి గీతాలు, హిందూ కీర్తనలు ఆలాపిస్తూ హిందువులను ఎంతోగానో ఆకర్షిస్తున్నారు. రాజుబాబా కీర్తనకారుడు అని ఆయన్ని హిందువులు పిలుస్తారు. మతసామరస్యమనేది భారతీయ సంస్కృతిలో ఆనాదిగా ఉన్నదే. సూఫీ మతాధికారుల సమాధుల వద్దకెళ్లి ఉర్సు కార్యక్రమాల్లో హిందువులు పాల్గొనడం తెల్సిందే. హిందువులు, సిక్కులు కలసి దేశంలో మసీదులు నిర్మించడం, ముస్లింలు, హిందువులు కలసి  దేవాలయాలు, గురుద్వారాలు నిర్మించడం లాంటి సంఘటనలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు