లక్నో వర్సిటీ వినూత్న కోర్సు

23 Feb, 2020 11:14 IST|Sakshi

లక్నో : గర్భం దాల్చినప్పుడు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భ్‌ సంస్కార్‌ పేరిట లక్నో యూనివర్సిటీ దేశంలోనే తొలిసారిగా సర్టిఫికెట్‌, డిప్లమో కోర్సును ప్రారంభించనుంది. ఈ కోర్సులో భాగంగా గర్భిణులు ఎలాంటి దుస్తులు ధరించాలి, వారు తీసుకునే ఆహారం, ప్రవర్తనాశైలి, ఫిట్‌నెస్‌ సహా ఎలాంటి సంగీతం వినాలి వంటి పలు పాఠ్యాంశాల్లో తర్ఫీదు ఇస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్ధులకు ఉపాథి సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. గర్భ్‌ సంస్కార్‌ కోర్సు అభ్యసించేందుకు పురుష విద్యార్థులకూ అవకాశం కల్పిస్తామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.

విద్యార్ధినులు భవిష్యత్‌లో తల్లులుగా మారే క్రమంలో ఆయా బాధ్యతలను చేపట్టేలా వారికి తగిన తర్ఫీదు ఇవ్వాలన్న రాష్ట్ర గవర్నర్‌, వర్సిటీల ఛాన్స్‌లర్‌ కూడా అయిన ఆనందిబెన్‌ పటేల్‌ సూచనలకు అనుగుణంగా అధికారులు ఈ తరహా కోర్సులకు రూపకల్పన చేశారని లక్నో వర్సిటీ ప్రతినిధి దుర్గేష్‌ శ్రీవాస్తవ తెలిపారు. గత ఏడాది వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ ఆనందిబెన్‌ మాట్లాడుతూ మహా భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలోనే యుద్ధ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తీరును వివరించారు. జర్మనీలోని ఓ వర్సిటీలో ఈ తరహా కోర్సు ఉన్నట్టు కూడా ఆమె వెల్లడించారు.

చదవండి : ఓయూ పీజీ హాస్టల్‌లో విద్యార్థి మృతి

మరిన్ని వార్తలు