సెంగార్‌కు ఉరే సరి

18 Dec, 2019 07:56 IST|Sakshi

ఉన్నావ్‌/న్యూఢిల్లీ: ఉన్నావ్‌ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌కు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తల్లి మంగళవారం డిమాండ్‌ చేశారు. మరో నిందితురాలు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం యూపీలోని ఉన్నావ్‌లో ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారన్న కేసులో ఢిల్లీ కోర్టు సెంగార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లి మంగళవారం స్పందిస్తూ ‘‘శశిసింగ్‌ను ఎందుకు వదిలేశారు? ఉద్యోగమిస్తానని మాయమాటలు చెప్పి నా కూతురిని కుల్దీప్‌ సెంగార్‌ వద్దకు తీసుకెళ్లింది శశిసింగే’అని వాపోయారు. బాధితురాలి సమీప బంధువు ఇప్పటికీ జైల్లో ఉన్నారని, అతడు విడుదలయ్యేంత వరకూ తనకు న్యాయం దక్కనట్లేనని స్పష్టం చేశారు. దోషికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ వాదించగా ఈ అంశంపై తాను డిసెంబరు 20న తీర్పు వెలువరిస్తానని ఢిల్లీ జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ ప్రకటించారు. (ఉన్నావ్‌’ దోషి ఎమ్మెల్యేనే)

మరిన్ని వార్తలు