అయోధ్యలో వెల్లివిరిసిన మతసామరస్యం

1 Sep, 2016 09:29 IST|Sakshi
ముస్లిం నాయకుడితో మహంత్ జ్ఞాన్ దాస్

అయోధ్య: మత సామరస్యానికి అద్దం పెట్టే ఉదంతమింది. తమ స్థలంలో సొంత ఖర్చుతో ముస్లింల కోసం మసీదు కట్టేందుకు ఉత్తరప్రదేశ్ లోని హిందూ దేవాలయం ముందుకు వచ్చింది. వివాదస్పద అయోధ్య స్థలంకు కొద్ది దూరంలో ఉన్న ప్రాంతంలో హనుమాన్గార్హి ఆలయం బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. తమ స్థలంలో ఉన్న ఆలంగిరి మసీదును పునర్ నిర్మించేందుకు దేవాలయ బోర్డు అంగీకరించింది.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించాడు. 1765లో నవాబ్ షుజౌద్దల్లా.. మసీదు ఉన్న ఈ స్థలాన్ని హనుమాన్గార్హి ఆలయంకు దానం చేశాడు. నమాజ్ కొనసాగించేందుకు అనుమతించాలన్న షరతుతో ఈ స్థలాన్ని అప్పగించాడు. నిర్వహణ సరిగా లేకపోవడంతో తర్వాతి కాలంలో మసీదు క్షీణ దశకు చేరింది. దీంతో ముస్లింలు ప్రార్థనలు చేయడానికి వీలు లేకుండా పోయింది. మసీదు కూలిపోయే దశలో ఉందని అయోధ్య మున్సిపల్ అధికారులు ఇటీవల హెచ్చరిక నోటీసులు అతికించారు.

మసీదును మరమ్మతు చేయడానికి అనుమతించాలని స్థానిక ముస్లింలు హనుమాన్గార్హి ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ జ్ఞాన్ దాస్ ను కలిశారు. తమ సొంత ఖర్చుతో మసీదును పునర్ నిర్మిస్తామని, ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి వీలుగా అనుమతి పత్రం కూడా ఇస్తామని మహంత్ హామీయిచ్చారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో ముస్లింలకు ఆయన ఇఫ్తార్ విందు కూడా ఇస్తుంటారు.

మరిన్ని వార్తలు