ముఖేశ్ అంబానీ చెప్పుచేతల్లో యూపీఏ, మోడీ ప్రభుత్వాలు

14 Feb, 2014 20:37 IST|Sakshi
ముఖేశ్ అంబానీ చెప్పుచేతల్లో యూపీఏ, మోడీ ప్రభుత్వాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. రాజీనామా సమర్పించిన తర్వాత కార్యకర్తలతో మాట్లాడుతూ.. ముకేశ్ అంబానీకి సహకరించడం కోసం కాంగ్రెస్, బీజేపీ లు ఒక్కటయ్యాయి అని ఆయన విమర్శించారు. ముకేశ్ అంబానీ చెప్పినట్లే యూపీఏ, మోడీ  ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
మాకు ప్రభుత్వాన్ని నడపటం రాదని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అంటున్నాయని.. అవును నిజమే మాకు లాలూచీ పడటం రాదు అని కేజ్రీవాల్ ధీటుగా జవాబిచ్చారు. జన లోక్ పాల్ బిల్లు ఆమోదించడమే మా ప్రధాన లక్ష్యం, దాన్ని ఆమోదించకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకున్నాయని ఆయన అన్నారు. జన్ లోక్ పాల్ బిల్లు వస్తే చాలా మంది నేతలు జైలుకు వెళ్లడం ఖాయం అని ఆయన అన్నారు. 
 
ప్రజల పక్షాన నిలువడం కోసం పదవికి రాజీనామా చేశాను. మీలో ఒక్కడిని..ప్రజల కోసం ఎన్నిసార్లైనా రాజీనామా చేస్తాను అని కేజ్రీవాల్ ఉద్వేగంగా ప్రసంగించారు. శాసన సభలో విధ్వంసం సృష్టిస్తే.. దేవాలయంలో విగ్రహాలను పగలకొట్టినట్టే అని ఆయన వ్యాఖ్యలు చేశారు. 
మరిన్ని వార్తలు