బిహార్‌లో ఎన్డీఏకు షాక్‌

5 Dec, 2018 20:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, రాష్ర్టీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) చీఫ్‌ ఉపేంద్ర కుష్వాహా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి గురువారం వైదొలగనున్నారని భావిస్తున్నారు. మంగళవారం ఆర్‌ఎల్‌ఎస్‌పీ నేతల చింతన్‌ శిబిర్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మోతిహరీలో జరిగే బహిరంగ సభలో బీజేపీతో దోస్తీకి స్వస్తి పలికే నిర్ణయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటిస్తారని చెబుతున్నారు. తాను బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీల అపాయింట్‌మెంట్‌ కోరినా లభించలేదని గత కొంతకాలంగా కుష్వాహా బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

వారు తనకు అపాయింట్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదో తనకు తెలీదని, వారు అంత బిజీగా ఉంటే కనీసం ఫోన్‌ అయినా చేయవచ్చని గతంలో ఆర్‌ఎల్‌ఎస్‌పీ చీఫ్‌ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బిహార్‌ సీఎం, జేడీ(యూ) చీఫ్‌ నితీష్‌ కుమార్‌పైనా కుష్వాహా గత నెలలో నిప్పులు చెరిగారు. నితీష్‌ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేశారని ఆరోపించారు.

కాగా, కుష్వాహా ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని భావిస్తున్నారు. బిహార్‌ విపక్ష నేత తేజస్వి యాదవ్‌తో కుష్వాహా భేటీ ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది.

మరిన్ని వార్తలు