జాతీయ వంటకంగా ఉప్మా.....

21 Jun, 2017 20:04 IST|Sakshi
జాతీయ వంటకంగా ఉప్మా.....

న్యూఢిల్లీ: తెలుగులో ఉప్పిండి, కన్నడలో ఉప్పిట్టు, తమిళంలో ఉప్మా (ఇప్పుడు తెలుగులో కూడా ఉప్మా అని పిలుస్తున్నారు)ను జాతీయ వంటకంగా ప్రకటించాలంటూ ప్రచారం గురువారం ట్విట్టర్‌లో జోరుగా సాగింది. ప్రముఖ భారతీయ చెఫ్‌లైనా ఫ్లాయిడ్‌ కార్డోజ్, ఆరతి సంపత్‌ల కారణంగా అమెరికాలో కూడా డిష్‌కు ఎంతో పేరు వచ్చింది. ఉప్మాకున్న ప్రత్యేక గుణమేమంటే ఎలా చేసినా బాగుంటుంది. అందుకని వంటల వల్లభులు తమదైన శైలీలో ఉప్మా చేసి ఇతరులను మెప్పించాలనుకుంటారు.

కొందరు ఉప్మాను పొపు గింజలు, మసాల దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, పశ్చి మిరపకాయలు, ఉల్లిపాయలతో సాదా సీదాగా చేస్తే, మరికొందరు పల్లీలు, కాజు, బఠానీలు జోడిస్తారు. ఇంకొందరు వాటికి టమోటా, బీన్స్, పుట్టగొడుగులు కలిపి చేస్తారు. కొందరు మామూలు నూనెతో చేస్తే మరికొందరు నెయ్యితో చేస్తారు. పచ్చి కొబ్బరి పాలతో కూడా చేస్తారు. ఇంకొందరు మాంసం, చేపలతో ఉప్మా చేస్తారు. మన చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ అమెరికాలో జరిగిన రెండు రియాలిటీ కుకింగ్‌ షోలో చికెన్, పుట్టగొడుగులు, కొబ్బరి పాల మిశ్రమంతో ఉప్మా చేసి రెండుసార్లు మొదటి ప్రైజ్‌ కొట్టేశారు. ధాన్యంతో చేసిన బ్రెడ్, చేపలతో ఉప్మా చేసిన ఆరతి సంపత్‌ వెనకబడ్డారు. ఆమె చేసిన డిష్‌ను కూడా ఆవురావురు మని తిన్నారట. ఉప్మాను గోధమ, బియ్యం తదితర రవ్వలతో చేస్తారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవమైన ఈ రోజున ఉప్మాను భారత జాతీయ డిష్‌గా ప్రకటించాలనే విషయం ఎందుకొచ్చిందంటే...తమిళ నటుడు, దర్శకుడు రాధాకష్ణన్‌ ప్రతిబన్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప్మాను జాతీయ డిష్‌గా ప్రకటిస్తే బాగుంటుందని మొదట ప్రతిపాదించారు. తాను సహాయ దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు కాలే కడుపును ఉప్మాతోని ఎలా నింపుకునేదో చెప్పారు. ఆరోజుల్లో ఎంతోమంది సహాయ దర్శకులు ఆర్థిక స్థోమత అంతగాలేక ప్రతిరోజు ఉప్మాతోనే జీవించే వారట. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో ఆ పరిస్థితి ఉందని చెబుతారు.

ఇది వెంటనే ట్విట్టర్‌లో వైరల్‌ అయింది. కొందరు జాతీయ డిష్‌ను ప్రకటించాల్సిన అవసరం లేదంటే కొందరు ఉప్మా కాకుండా ప్రత్యామ్నాయాలు సూచించారు. జాతీయ డిష్‌ అవసరం లేదంటూ దేశభక్తులు కూడా సెటైర్లూ వేశారు. బిర్యానీలను, పులిహోరాను, అటుకులతో చేసిన డిష్‌లను వంటకాలను జాతీయ వంటగా గుర్తించాలన్నారు. ఉప్మాకు కూడా ఎక్కువ మందే మద్దతు పలికారు. అయితే ఉప్మాను జాతీయ వంటకంగా గుర్తించడం వల్ల ఇడ్లీ, దోశ, పూరి లాంటివి చిన్నబోయాయని కూడా వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు