అక్టోబర్‌ 4న సివిల్స్‌ ప్రిలిమినరీ

6 Jun, 2020 04:37 IST|Sakshi

న్యూఢిల్లీ: అక్టోబర్‌ 4వ తేదీన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష జరగనుందని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం తెలిపింది. మేలోనే జరగాల్సిన ఈ పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఎంపికైన విద్యార్థులకు పర్సనాలిటీ టెస్టులు జూలై 20 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ చెప్పారు. లాక్‌డౌన్‌కు  కేంద్రం సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

సవరించిన  క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4(ఆదివారం), మెయిన్స్‌ 2021జనవరి 8(శుక్రవారం)న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మెయిన్స్‌ 5 రోజుల పాటు సాగనున్నట్లు తెలిపారు. ఈ తేదీలు మారే అవకాశం కూడా ఉంటుందన్నారు. 2019 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సంబంధించిన మెయిన్స్‌ వచ్చే నెల 20న ప్రారంభం కానున్నట్లు చెప్పారు.  ఎన్డీఏ, ఎన్‌ఏ (1) తో పాటు ఎన్డీఏ, ఎన్‌ఏ (2) 2020ను సెప్టెంబర్‌ 6న జరుగుతాయని యూపీఎస్సీ పేర్కొంది. ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) కోసం అక్టోబర్‌ 4న జరగాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పరీక్షలు   వాయిదా పడినట్లు తెలిపింది.

>
మరిన్ని వార్తలు