సివిల్స్‌ టాపర్‌ ప్రేమకథ

7 Apr, 2019 04:00 IST|Sakshi
కుటుంబ సభ్యులతో కటారియా

తన విజయంలో ప్రేయసి పాత్ర ఉందని ప్రకటించిన కటారియా

అభ్యుదయవాది అంటూ ట్విట్టర్‌లో వెల్లువెత్తిన ప్రశంసలు

న్యూఢిల్లీ:  తన విజయంలో గర్ల్‌ఫ్రెండ్‌ పాత్ర కూడా ఉందని సివిల్స్‌ టాపర్‌ కనిషక్‌ కటారియా చేసిన ప్రకటనతో ట్విట్టర్‌ హోరెత్తిపోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఆయన అభ్యుదయభావంతో స్పందించారని నెటిజెన్లు పొడిగారు. కెరీర్‌లో విజయం సాధించేందుకు ప్రేయసి అడ్డుకాదని కొందరు వ్యాఖ్యానించారు. ‘ఈ క్షణం ఎంతో ఆశ్చర్యకరం. సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు. ఈ విషయంలో మద్దతుగా నిలిచి నైతిక స్థైర్యాన్నిచ్చిన నా తల్లిదండ్రులు, సోదరి, గర్ల్‌ఫ్రెండ్‌కు కృతజ్ఞతలు’ అని కటారియా శనివారం విలేకర్లతో అన్నారు. తన విజయం పట్ల గర్ల్‌ఫ్రెండ్‌కు బహిరంగంగా ధన్యవాదాలు చెప్పిన తొలి సివిల్స్‌ టాపర్‌ కటారియానే అని భావిస్తున్నారు.

‘మన దేశంలో చదువుకునే పిల్లలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చదువుపైనే దృష్టిపెట్టాలి. కానీ ఆలిండియా సివిల్స్‌ టాపర్‌ కటారియా తన ప్రేయసికి ధన్యవాదాలు చెప్పారు’ అని ఒకరు అనగా..యూపీఎస్సీ పరీక్ష పాసవ్వడానికి ప్రేయసి అడ్డుకాదని మరోసారి నిరూపితమైందని మరొకరు ట్వీట్‌ చేశారు. ఇలా గర్ల్‌ఫ్రెండ్‌కు ధన్యవాదాలు చెప్పే ధైర్యం ఎందరికి ఉంటుందని మరొకరు ప్రశ్నించారు. ‘ప్రేయసి, సంబంధాలు కెరీర్‌ లక్ష్యాల నుంచి దృష్టి మరలుస్తాయని అన్నవారెక్కడ?’ అని మరొకరు ప్రశ్నించారు. జైపూర్‌కు చెందిన కటారియా తండ్రి సాన్వర్‌ వర్మ, అంకుల్‌ కేసీ వర్మ ఐఏఎస్‌ అధికారులే కావడం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు