వీర విధేయుడికీ దర్శనం దక్కలేదు!

3 Oct, 2014 16:58 IST|Sakshi
వీర విధేయుడికీ దర్శనం దక్కలేదు!

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం. ఇంత అధికారాన్ని అనుభవించిన ఆమె.. జైలు జీవితాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. దాంతో తనను కలిసేందుకు వచ్చినవారితో మాట్లాడేందుకు జయలలిత నిరాకరించారట. అది కూడా  ఎంతవరకూ అంటే...'అమ్మ'  ఆజ్ఞతో సీఎం పీఠాన్ని అధిష్టించిన వీర భక్తుడికి కూడా ఆమె అనుగ్రహం కరువైంది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే పన్నీరు సెల్వం బెంగళూరు వెళ్లారు. అమ్మ ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్లిన ఆయనకు అక్కడ చుక్కెదురు అయ్యింది. సమయం మించిపోవటంతో జయను కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దాంతో పన్నీరు సెల్వం మంగళవారం ఉదయం  జయలలితను కలిసేందుకు మళ్లీ జైలుకు వెళ్లారు. అయితే అధికారుల అనుమతి  ఇచ్చినా అమ్మ మాత్రం మాట్లాడేందుకు ఇష్టపడలేదట. అయినా పన్నీరు సెల్వం పట్టువదలని విక్రమార్కుడిలా మంగళవారం మధ్యాహ్నం వరకూ జైలు ఆవరణలోనే పడిగాపులు కాసినా ఫలితం లేకపోయిందట.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై దృష్టి పెట్టాలే కానీ, జైలు చుట్టూ తిరగటం సరికాదని జయలలిత ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. దాంతో తీవ్ర నిరాశకు గురైన పన్నీర్.. అమ్మను కలవకుండానే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జయలలిత పరప్పన అగ్రహారం జైలులో ఖైదీ నెం. 7402గా… సెల్ నెం.23లో ఉన్నారు.

మరిన్ని వార్తలు