యూపీఎస్‌ఆర్‌టీసీ వివాదాస్పద నిర్ణయం

14 May, 2020 20:49 IST|Sakshi

విమర్శల వెల్లువతో  ఉత్తర్వులపై సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే ట్యాక్సీలకు భారీ మొత్తంలో రూ 10,000 నుంచి రూ.12,000 చార్జీలుగా నిర్ణయించిన యూపీఎస్‌ఆర్‌టీసీ నిర్ణయం వివాదాస్పదమైంది. ఢిల్లీకి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్‌లకు వెళ్లే క్యాబ్‌లకు కూడా ఇదే భారీ మొత్తం వసూలు చేయాలని యూపీఎస్‌ఆర్‌టీసీ తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియాలో విమర్శలు చెలరేగడంతో యూపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది.

చార్జీలను పునఃసమీక్షించేందుకు యూపీఎస్‌ఆర్‌టీసీ కమిటీని నియమించింది. వందే భారత్‌ మిషన్‌ కింద విదేశాల నుంచి ఢిల్లీకి తిరిగివచ్చే ప్రయాణీకులు అక్కడి నుంచి నోయిడా, ఘజియాబాద్‌ సహా యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు క్యాబ్‌కు రూ 10,000, ఎస్‌యూవీకి అయితే రూ 12,000 చెల్లించాలని యూపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ రాజశేఖర్‌ నోయిడా, ఘజియాబాద్‌ ప్రాంతీయ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి యూపీలోని క్వారంటైన్‌ సెంటర్లకు తాము నడిపే సర్వీసులు పూర్తి ఉచితమని, ట్యాక్సీ సేవల కోసం నిర్ణయించిన చార్జీలపై సమీక్షించేందుకు కమిటీని నియమించామని, 24 గంటల్లో కమిటీ తమ నివేదికను సమర్పిస్తుందని యూపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ రాజశేఖర్‌ ప్రకటించారు.

చదవండి : ఢిల్లీలో బీభ‌త్సం సృష్టించిన వ‌డ‌గండ్ల వాన

మరిన్ని వార్తలు