పెళ్లి ఆగకుండా కాపాడిన రాష్ట్రపతి

7 Jan, 2020 11:20 IST|Sakshi

పెళ్లి అనగానే ఎక్కడాలేని హడావిడీ చేస్తారు. వివాహం ఇంకా నెల రోజులు ఉందనగానే పనులను ప్రారంభిస్తారు. ఏ ఫంక్షన్‌హల్‌లో చేయాలి. ఎలాంటి విందు పెట్టాలి.. ఎవరెవరినీ ఆహ్వనించాలి. ఇలా ఎన్ని పనులుంటాయి కదా.. అచ్చం ఇలాగే ఆలోచించారు ఓ కుటుంబం. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా పెళ్లి రెండు రోజులు ఉంది అనగా వారికి షాక్‌ తగిలింది. అదేంటంటే... యూఎస్‌కు చెందిన ఆశ్లే హల్‌ అనే మహిళ కేరళలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 7న(మంగళవారం)తేదిని ఫిక్స్‌ చేయడంతో నెల రోజుల ముందే  కొచ్చిలోని తాజ్‌ హోటల్‌లో హాల్‌ను రిజర్వ్‌ చేసుకున్నారు. అయితే అదే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొచ్చి పర్యటనకు రానున్నారని తెలిసింది. దీంతో హోటల్‌లో పెళ్లికి అనుమతిస్తే రాష్ట్రపతికి భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన హోటల్‌ సిబ్బంది వివాహా తేదిని మార్చుకోవాలని వారికి సూచించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇలా ఉన్నపాటున చెబితే ఎలా మార్చుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోతుందని నిరాశ చెందిన వధువు ఓ ఆలోచన చేసింది. ఏకంగా రాష్ట్రపతి భవన్‌కు ట్విటర్‌ అకౌంట్‌కు ట్వీట్‌ చేసింది. తన పెళ్లి సవ్యంగా జరగడానికి సహాయం కావాలని కోరింది..

దీనిపై స్పందించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పెళ్లికి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెళ్లి తేదిని మార్చాల్సిన అవసరం లేదని.. అనుకున్న తేదికే ఆమె వివాహం జరగాలని ఆదేశించారు. ఇందుకు ఆయన భద్రతా బలగాలను తగ్గించాలని సూచించారు. కాగా ఆధికారులు స్థానికంగా పరిస్థితిని విశ్లేషించి రాష్ట్రపతి పర్యటనకు, పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. సమస్య పరిష్కరమైనందుకు సంతోషంగా ఉందని తెలిపిన రాష్ట్రపతి నూతన వధువరులను ఆశీర్వదించి... శుభాకాంక్షలు తెలిపారు.కాగా కేరళ పర్యటన నిమిత్తం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొచ్చికి చేరుకున్నారు. అనంతరం తాజ్‌ హోటల్‌లో బస చేసిన ఆయన మంగళవారం  లక్షద్వీప్‌కు చేరుకోనున్నారు. 

మరిన్ని వార్తలు