కరోనా : విదేశాల్లో చిక్కుకున్న వారికి ఊరట

24 Jun, 2020 18:21 IST|Sakshi
ఫైల్ ఫోటో

వందే భారత్ మిషన్ తరహాలో అంతర్జాతీయ విమాన సేవలు?

 పరిశీలనలో పలు వినతులు, త్వరలోనే నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనాలాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. అమెరికా, యూరోపియన్ దేశాల్లోని భారతీయులను వందే భారత్ మిషన్ తరహాలో అంతర్జాతీయ విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారత విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా భారతీయులను దేశానికి తీసుకురావడంతోపాటు, ఇక్కడ ఉండిపోయిన విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించే అవకాశం లభించనుంది.

వందే భారత్ మిషన్ తరహాలో చార్టర్డ్‌ విమాన సేవలకు తమ కంపెనీలనూ అనుమతించాలంటూ అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ సహా పలు దేశాల  విమానయాన సంస్థల నుంచి అభ్యర్ధనలు వచ్చాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ  ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి పరిశీలనలో ఉన్నాయని చర్చలకనుగుణంగా త్వరలోనే తుది నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించింది.  దీనిపై జూన్ 15న యుఎస్ రవాణా శాఖ, యుఎస్ ఎంబసీ ప్రతినిధులతో ఒక రౌండ్ చర్చలు జరిపామని చెప్పింది. అలాగే గల్ఫ్ దేశాల నుండి షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి ప్రారంభించాలన్న అభ్యర్థన కూడా పెండింగ్‌లో ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్నభారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇపుడు మన దేశంలోని ఇతర దేశాల పౌరులను వారి వారి దేశాలకు తరలించనున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా  కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నలుమూలల చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. అయితే భారత ప్రభుత్వం వివక్షా పూరితంగా వ్యవహరించి ఇరు దేశాల విమానయాన ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించిన ఆమెరికా ఇటీవల వందే భారత్‌ మిషన్‌కు అభ్యంతరం తెలిపింది. తమ విమానయాన సంస్థలకు చెందిన చార్టర్డ్‌ విమానాల రాకపోకలను భారత్‌ అడ్డుకుంటున్నందు వల్లే ఎయిరిండియా చార్టర్డ్‌ విమానాల రాకపోకలపై జూలై 22 నుంచి నిషేధం అమలవుతుందని అమెరికా రవాణా విభాగం(డీఓటీ) ప్రకటించింది. అంతేకాదు చిక్కుకుపోయిన పౌరుల తరలింపు సమయంలో ఎయిరిండియా అక్రమంగా టికెట్లను అమ్ముకుంటోందని డీఓటీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు