ముస్తఫా.. ముస్తఫా

25 Feb, 2020 04:44 IST|Sakshi
స్టేడియంలో మోదీ ఇచ్చిన పుస్తకంతో ట్రంప్‌ దంపతులు

అమెరికాతో మైత్రిపై మోదీ వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌: ట్రంప్‌ భారత్‌కు ప్రత్యేక స్నేహితుడని ప్రధాని మోదీ అభివర్ణించారు. ట్రంప్‌ భారత పర్యటన భారత్, అమెరికా సంబంధాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. భారత్, అమెరికాలు సహజ మిత్ర దేశాలన్నారు.  మొతెరా స్టేడియంలో సోమవారం జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. తొలుత, ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ ప్రసంగించిన మోదీ.. ట్రంప్‌ ప్రసంగం అనంతరం మళ్లీ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి స్వాగతం’ అంటూ ట్రంప్‌కు మోదీ స్వాగతం పలికారు.

‘21వ శతాబ్దంలో ప్రపంచ గతిని మార్చడంలో భారత్, అమెరికా సంబంధాలు, వాటి మధ్య నెలకొన్న సహకారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు దేశాలు సహజసిద్ధ భాగస్వాములు’ అని తన ప్రసంగంలో మోదీ వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య నెలకొన్న సంబంధాలను ప్రస్తావిస్తూ.. అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని గుర్తు చేశారు. ‘భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. భారత్‌కు రక్షణ ఉత్పత్తులను అత్యధికంగా అందిస్తున్న దేశం అమెరికా’ అన్నారు. ఈ రెండు దేశాలు సంయుక్తంగా అనేక సైనిక విన్యాసాలు నిర్వహించాయన్నారు.

‘ఈ రెండు దేశాల మధ్య సహకారం ఇండో పసిఫిక్‌ ప్రాంతంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత, పురోగతి నెలకొనడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ సంబంధాలుగా తీసిపారేయలేమని, ప్రస్తుతం అవి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ తన కుటుంబంతో భారత్‌కు రావడం దీన్నే స్పష్టీకరిస్తోందన్నారు. ‘ట్రంప్‌ భారత పర్యటన ఈ దశాబ్దం ప్రారంభంలో చోటు చేసుకున్న అతిపెద్ద కార్యక్రమం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ట్రంప్‌ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం. ఈ అధ్యాయం భారత్, అమెరికాల ప్రజల పురోగతి, సౌభాగ్యాలకు తార్కాణంగా నిలుస్తుంది’ అన్నారు.

కార్యక్రమంలో ముందు వరసలో ఇవాంకా, ఆమె భర్త కుష్నర్, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు

మరిన్ని వార్తలు