25న భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి

21 Jun, 2019 10:38 IST|Sakshi
మైక్‌ పాంపియో

న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో జూన్‌ 25 నుంచి 27 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓ దేశ విదేశాంగ శాఖ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య బంధాలను బలపరిచేలా సమావేశాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. జూన్‌ 28, 29 తేదీలలో జపాన్‌లోని ఒసాకా పట్టణంలో జరగనున్న జీ20 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో మైఖేల్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తోపాటు ఇతర అధికారులతోనూ భేటీలు జరగనున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మీడియాతో చెప్పారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంతో పాటు ప్రపంచ సమస్యలను గురించి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు.

హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా నిబంధనలు విధిస్తున్న అంశం గురించి మీడియా ప్రతినిధులు రవీశ్‌ వద్ద ప్రస్తావించగా, ఈ విషయం గురించి అమెరికా నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదన్నారు. భారత్‌కు రానున్న పాంపియో ఏ విషయాలు మాట్లాడాలో ఇప్పుడే ఊహించడం సరికాదన్నారు. అమెరికాలో భారత నిపుణులు ప్రతి రంగంలో ఉన్నారని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంలో వీరు కూడా తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. కేవలం కొన్ని అంశాల్లో మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో అమెరికాతో సంబంధాల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇలా ఆలోచిస్తే సంబంధాలు బలంగానే ఉన్నాయన్నారు. ఇరుదేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, వాణిజ్యం రూ. పదిలక్షల కోట్లకు పెరిగిందన్నారు. భారత్‌ పర్యటన అనంతరం పాంపియో శ్రీలంక, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కూడా వెళ్లనున్నారు. ఇండో–పసిఫిక్‌ దేశాలతో యూఎస్‌ సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. 

మరిన్ని వార్తలు