సీఏఏ : అమెరికా యువతి వీడియో వైరల్‌

25 Dec, 2019 16:24 IST|Sakshi

ఫిరోజా అజీజ్ గుర్తుందా? అమెరికాకు చెందిన ఈ యువతి నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో  వైరల్‌గా మారింది.  చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ చేసిన ఈ టిక్‌టాక్ వీడియో  అక్కడ సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల ఈ అమెరికా యువతి  తాజాగా  పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై స్పందించింది. సీఏఏను వ్యతిరేకిస్తూ వీడియో తీసి ట్విట్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఎప్పటి మాదిరిగానే చర్మ సంరక్షణ టిప్స్‌ చెప్పిన ఫిరోజా.. అనంతరం సీఏఏపై స్పందించింది. ‘ నేను కూడా సీఏఏ పై మాట్లాడదలచుకున్నాను.  అది అనైతికమైన చట్టం. భారతదేశానికి వలస వచ్చిన  ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం ఒప్పుకోదు. వారిని మాత్రమే మినహాయించి మిగతావారికి పౌరసత్వం ఇవ్వడం దారుణం. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వారిని మతం పేరుతో మినహాయించడం సరియైనది కాదు. ఇది అనైతిక చర్య’  అని ఫిరోజా అన్నారు.

మతం అనేది దేశ భక్తిని చూపించదని, ముస్లిం అయినా, హిందువైనా అందరూ సమానమే అన్నారు. కాగా, ఫిరోజా వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ నేను ఫిరోజాకు మద్దతు తెలుపున్నాను. సీఏఏ అనేది అనైతిక చట్టం. సీఏఏను నేను తిరస్కరిస్తున్నా’,, ‘ ఫిరోజా గారు మంచి వీడియో తీశారు. మీకు భారత రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన లేదనుకుంటా.  పౌరసత్వం ఇవ్వడం అనేది మీరు చెప్పినంత సింపుల్‌ కాదు. మతపరంగా పౌరసత్వం తిరస్కరిస్తున్నారనేది వాస్తవం కాదు. కానీ మీరు మంచి వీడియో తీశారు’,, ‘సీఏఏ గురించి ప్రతి ఒక్కరు ఆలోచించేలా చెప్పారు. మీరు వివరించిన విధానం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంది. ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని తీయండి​’  అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు