మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు

20 Jun, 2019 11:52 IST|Sakshi

కోల్‌కతా : మాజీ మిస్‌ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తా కారులో వెళ్తుండగా.. ఆకతాయిలు ఆమె వాహనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడానికి సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పుడు వారు ఘటన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఈ విషయాలన్నింటిని ఉషోషి ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించింది. దాంతో పోలీసులు తీరు పట్ల సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించారు. సదరు చారు మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్సై పీయూష్‌ కుమార్‌ బాల్‌ను సస్పెండ్‌ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం గురించి కూడా దార్యప్తు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్‌లో రికార్డ్‌ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్‌స్టేన్‌కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్‌బుక్‌ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు