యూపీలో డిఫెన్స్‌ కారిడార్‌

22 Feb, 2018 02:38 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ

ప్రకటించిన ప్రధాని మోదీ

రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలొచ్చే అవకాశం

లక్నో: ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లలో ఒకదాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటుచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని వల్ల రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు, సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ఈ కారిడార్‌ను ఆగ్రా, అలహాబాద్, లక్నో, కాన్పూర్, ఝాన్సీ, చిత్రకూట్‌లకు విస్తరిస్తామని తెలిపారు. బుధవారం లక్నోలో మొదలైన రెండు రోజుల పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో మోదీ ఈ విషయం వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీ యూపీ పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ..యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్నారు. ప్రతికూల వాతావరణాన్ని అధిగమించే సామర్థ్యం(పొటెన్షియల్‌), విధానాలు(పాలసీ), ప్రణాళికలు(ప్లానింగ్‌), పనితీరు(పెర్ఫామెన్స్‌) లాంటివి అభివృద్ధికి మార్గాలని, ఈ విషయంలో యూపీ సర్కారు, ప్రజలు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు