పెద్ద మనసు చాటుకున్న యూపీ గవర్నర్‌

26 Aug, 2019 12:02 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ పెద్ద మనసు చాటుకున్నారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యంతోపాటు చదువు చెప్పిస్తానని వెల్లడించారు. గవర్నర్‌ అడుగుజాడల్లో నడిచిన రాజ్‌భవన్‌ సిబ్బంది మరో 21 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. పిల్లలకు వైద్యం, విద్య, పౌష్టికాహారం అందిస్తారు. 2025 నాటికి దేశం నుంచి క్షయను పూర్తిగా తరిమేద్దామనే ప్రధాని మోదీ పిలుపు మేరకు చర్యలు చేపట్టామని గవర్నర్‌ చెప్పారు. అందుకోసం రాజ్‌భవన్‌ నుంచే తమ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు.

క్షయతో బాధపడుతున్న చిన్నారుల్ని దత్తత తీసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. తమకు తోచిన విధంగా సాయపడి క్షయ రోగులకు చేయూతనివ్వాలన్నారు. ఇక ప్రభుత్వ పథకాలకు అర్హులైనా కూడా చాలామంది వాటిని పొందలేకపోతున్నారని ఆనందిబెన్‌ చెప్పారు. కేవలం ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యం కాదని..  చదువుకున్న వారు పేదలకు ప్రభుత్వ పథకాలు పొందేవిధంగా తోడు నిలవాలని కోరారు. ఇదిలాఉండగా.. లక్నో నగరంలోనే 14,600 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని జిల్లా వైద్యాధికారి పీకే గుప్తా తెలిపారు. పౌష్టిక ఆహారం కోసం వారికి నెలకు రూ.500 ఇస్తున్నామని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు