యూపీలో క్షణం..క్షణం..ఉత్కంఠ

31 Dec, 2016 13:52 IST|Sakshi
యూపీలో క్షణం..క్షణం..ఉత్కంఠ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అధికార పక్షం సమాజ్‌వాది పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దష్టి ఇప్పుడు ఈ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలపైనే కేంద్రీకతమై ఉంది. పార్టీ నుంచి తనను తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరేళ్లపాటు బహిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ శనివారం ఉదయం తన ఇంట్లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి కొంత మంది పార్టీ సీనియర్‌ నాయకులతోపాటు 190 మంది పార్టీ శాసన సభ్యులు హాజరైనట్లు అఖిలేష్‌ మద్దతుదారులు తెలియజేశారు. తన మద్దతుదారులతో సంప్రతింపులు జరిపిన అనంతరం అఖిలేష్‌ యాదవ్‌ తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ను కలసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కూడా అక్కడ తన మద్దతుదారులతో ఇదే సమయంలో సమావేశమయ్యారు. ఆయన సమావేశానికి అధికార పార్టీకి చెందిన 20 మంది శాసన సభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు హాజరైనట్లు తెల్సింది. పార్టీ నుంచి విడిపోయేందుకు అఖిలేష్‌ సిద్ధపడ్డారా లేదా ఆఖరి సారి తండ్రితో సంధికి ప్రయత్నించేందుకు ఆయన వద్దకు అఖిలేష్‌ వెళ్లారా? అన్న విషయం స్పష్టం కావడం లేదు. అయితే ఆయన తన తండ్రి ఆశీర్వాదం తీసుకునేందుకే వెళ్లారని కొందరు అఖిలేష్‌ సన్నిహితులు తెలియజేస్తున్నారు.

అఖిలేష్‌ ప్రభుత్వం పడిపోతుందా?
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 404 సీట్లు ఉండగా, వాటిలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సమాజ్‌వాది పార్టీకి మొత్తం 229 మంది ఉన్నారు. వారి నుంచి 190 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అఖిలేష్‌ వర్గం తెలియజేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి 28 సీట్లు ఉన్నాయి. అఖిలేష్‌ను పార్టీ నుంచి బహిష్యరించిన నేపథ్యంలో ఆయన్ని సభా విశ్వాసాన్ని పొందాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ రామ్‌ నాయక్‌ కోరినట్లయితే ఏం జరుగుతందనే అంశంపై కూడా మరోపక్క చర్చ జరుగుతోంది.

అఖిలేష్‌ యాదవ్‌ అసెంబ్లీ విశ్వాసాన్ని కోరాల్సి వస్తే అందుకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ ముందుకు వచ్చారు. అంటే ఎస్పీ నుంచి అఖిలేష్‌ తన మద్దతుదారులతో విడిపోయినట్లయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 28 మంది సభ్యులు ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌ లక్నోలోనే మకాం వేసి ఎస్పీలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అఖిలేష్‌కు అసెంబ్లీ బలనిరూపణకు 201 మంది సభ్యుల మద్దతు ఉంటే చాలు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఆయనకు 218 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది కనుక ఆయన ప్రభుత్వానికి ఢోకాలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్‌ వర్గంతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది.

ఇలాంటి సమయంలో ములాయం సింగ్‌ ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్న విషయం ప్రస్తుతానికి అంతుచిక్కకుండానే ఉంది. అపార రాజకీయ అనుభవం కలిగిన ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయ ఎత్తుగడుల్లో ఆరితేరిన వారు. అలాంటి వ్యక్తి పార్టీ చీలిపోయేందుకు ఆస్కారమిస్తారా? అన్నది అసలు ప్రశ్న. చీలిపోతే ఎక్కువ నష్టపోయేది ఆయన వర్గమే. కాంగ్రెస్‌ అండతో వచ్చే ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఎలాగు ఉంది. ప్రస్తుతమున్న సమీకరణల ప్రకారం రానున్న ఎన్నికల్లో బీజీపీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పార్టీ చీలిపోతే ఎక్కువ నష్టపోయేది ములాయం వర్గం కాగా, ఎక్కువ లాభపడేది బీజేపీ.

అంతా నాటకమేనా?
ప్రభుత్వం వ్యతిరేక ముద్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌పై పడ కుండా ఉండేందుకే ములాయం సింగ్‌ యాదవ్‌ పార్టీలో లేని అంతర్గత విభేదాలను సష్టించారని, అహిష్టంగానే కాంగ్రెస్‌కు, అఖిలేష్‌కు మధ్య సంధికుదిర్చేందుకు కూడా సిద్ధమయ్యారని కొంత మంది కాంగ్రెస్‌ నాయకులతోపాటు కొంత మంది రాజకీయ విశ్లేషకులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే రసవత్తరమైన మహా రాజకీయ నాటకానికి ములాయం తెరతీశారని ఇప్పటికీ అంటున్న వారు ఉన్నారు. అయితే ఈ నాటకం పార్టీ నుంచి అఖిలేష్‌ను బహిష్కరించేంత దూరం కొనసాగుతుందా? అన్నది ఇక్కడ ప్రధాన సందేహం. ఆదివారం నాడు పార్టీ జాతీయ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో  ఏం జరుగుతుందో కాస్త స్పష్టత రావాలంటే రేపటి వరకు నిరీక్షించాల్సిందే.

 

మరిన్ని వార్తలు