ఆదర్శంగా నిలిచిన యూపీ విద్యుత్‌ శాఖ మంత్రి

16 Nov, 2019 16:05 IST|Sakshi

లక్నో : వేల కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖుల ఇళ్లలో ప్రీపెయిడ్‌ ఎలక్ట్రిక్‌  విద్యుత్‌ మీటర్లను బిగించాలని నడుం కట్టింది. దానిలో భాగంగా రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి శ్రీకాంత్‌ శర్మ శుక్రవారం తన ఇంట్లో 25 కేవీ కెపాసిటీ గల ప్రీపెయిడ్‌ ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ మీటర్‌ బిగించారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇదే పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్‌ డ్రైవ్‌ను తన ఇంటి నుంచి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..

‘రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖుల నివాసాలు, ఉన్నతాధికారుల ఇళ్లు, ప్రభుత్వ బంగళాల్లో దాదాపు రూ.13 వేల కోట్లు విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే విద్యుత్‌ సంస్థల మనుగడ కష్టం అవుతుంది. ప్రీపెయిడ్‌ ఎలక్ట్రిక్‌  విద్యుత్‌ మీటర్లతో బకాయిలకు అవకాశమే ఉండదు. మీటర్‌లో బ్యాలెన్స్‌ అయిపోగానే ఆటోమేటిక్‌గా కరెంట్‌ సరఫరా నిలిచిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మీటర్లను లక్ష వరకు బిగించాలని అక్టోబర్‌ 29నే నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో సామాన్య జనం కూడా భాగం కావాలి. భారీగా పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు అవకాశమిస్తున్నాం. విద్యుత్‌ చౌర్యం జరగకుండా పోలీస్‌ శాఖ సేవలు వినియోగించుకుంటాం’అన్నారు.

మరిన్ని వార్తలు