కరోనా: 100 మంది ఒకేచోట.. మహిళ హల్‌చల్‌

26 Mar, 2020 10:29 IST|Sakshi
వీరంగం సృష్టించిన మహిళ(ఫొటో: ఎన్డీటీవీ)

లక్నో: ‘‘నేను ఆదిశక్తిని. దమ్ముంటే నన్ను ఇక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నించండి’’ అంటూ ఓ మహిళ పోలీసులకు సవాలు విసిరింది. వారిపై కత్తిదూస్తూ హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా వైరస్‌(కోవిడ్‌-19)వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలన్నీ పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదని  నిబంధనలు విధించాయి. ఒకవేళ ఎవరైనా అనవసరంగా రోడ్లపై తిరిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.(కరోనా: 20 వేలు దాటిన మరణాలు.. అత్యధికంగా అక్కడే )

ఈ క్రమంలో తనను తాను దేవతగా చెప్పుకొనే ఓ మహిళ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించింది. మెహ్దా పూర్వాలోని తన నివాసం వద్ద సమావేశం ఏర్పాటు చేసి.. తన అనుచరులను ఆహ్వానించింది. దీంతో దాదాపు వంద మంది అక్కడ గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో లాఠీ చార్జీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సదరు మహిళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేస్తామని హెచ్చరించినా వినకుండా వారిపైకి కత్తిదూసింది. దీంతో మహిళా పోలీసులు ఆమెను కట్టడి చేసి.. లాక్కెళ్లి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.(ఢిల్లీలో ఆ డాక్టర్‌ కుటుంబానికి కరోనా )

మరిన్ని వార్తలు