ఖరీదైన పుట్టిన రోజు వేడుకలు.. ఎక్కడంటే

30 Jul, 2018 13:14 IST|Sakshi
జైలులో కేక్‌ కట్‌ చేసి పుట్టిన రోజు జరుపుకుంటున్న శివేంద్ర

ఫజియాబాద్‌, యూపీ : ఖైదీలనగానే వారి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని.. కనీసం వారిని మనుషులుగా కూడా చూడరనే నమ్మకం ఒకటి జనాల్లో బాగా పాతుకుపోయింది. ఫజియాబాద్‌కు చెందిన జైలు అధికారులు  ఈ విషయాన్ని నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. జైలులో ఉన్న ఓ ఖైదీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటానని కోరగా అనుమతివ్వడమే కాక అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేశారు అధికారులు. కానీ ఆ ఏర్పాట్ల కోసం తీసుకున్న మొత్తమే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. శివేంద్ర అనే వ్యక్తి ఫజియాబాద్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నెల 23న అతని పుట్టిన రోజు. దాంతో జైల్లోనే పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనుకున్న శివేంద్ర, అందుకు అనుమతివ్వాల్సిందిగా అధికారులను కోరాడు. అధికారులు ఒప్పుకోవడమే కాక, పుట్టిన రోజు నిర్వహించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లును కూడా పూర్తి చేశారు. శివేంద్ర ఫోటో ప్రింట్‌ చేసిన కేక్‌ తీసుకొచ్చారు. అనంతరం జైలులోనే ఇతర ఖైదీల నడుమ శివేంద్ర పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. అయితే ఇందుకు గాను అతని దగ్గర నుంచి ఏకంగా లక్ష రూపాయలను తీసుకున్నారని సమాచారం.

అయితే ఎలా లీక్‌ అయ్యిందో ఏమో కానీ ఈ పుట్టినరోజు వేడుకల వీడియో ఒకటి లీక్‌ అయ్యి, సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. అయితే దీనిపై అధికారులు మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం యోగి ఆదిత్యానాథ్‌ సర్కార్‌ను తీవ్రంగా తప్పు పడుతున్నారు. డబ్బు ఇస్తే చాలు, ఖైదీలు ఏం అడిగినా అధికారులు ఏర్పాటు చేస్తారా అని విమర్శిస్తున్నారు.

కానీ కొందరు మాత్రం అధికారులు తీరు మీద సెటైర్లు వేస్తున్నారు. ‘జైలులో ఉన్నంత మాత్రానా మనుషులం కాకుండా పోతామా. పుట్టిన రోజు లాంటి వేడుకలు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సాధారణంగా మధ్యతరగతి ఇళ్లలో పుట్టిన రోజు ఖర్చు మహా అయితే ఓ పదివేల రూపాయలుంటుంది. కానీ ఇది జైలు కదా.. అందుకే ఖర్చు కాస్తా ఎక్కువయ్యింది. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా’ అంటూ చురకలేస్తున్నారు.

మరిన్ని వార్తలు