ప్రమాదంలో ఉత్తరాఖండ్‌ ?

23 Dec, 2017 12:10 IST|Sakshi

సాక్షి, డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని వలసలు వేధిస్తున్నాయి. అక్కడి గ్రామాలు నానాటికి హరించుకుపోతున్నాయి. పర్వతమయ ప్రాంతాల్లో ఉండలేక, తమ బతుకులు ముందుకు తీసుకెళ్లలేక ప్రతి ఏడాది ఊర్లకు ఊర్లే ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. యువకులంతా కూడా తమ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు. దీంతో కనీసం 20 ఏండ్ల నుంచైనా తమ పిల్లలను చూసుకోలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఉదాహరణకు పౌరీ జిల్లాలో భోకాండి అనే గ్రామంలో ఇద్దరంటే ఇద్దరే వ్యక్తులు ఉంటున్నారు. ఇద్దరు ముసలి వారే. ప్యారేలాల్‌ కు 75 ఏళ్లు ఉండగా ఆయన భార్య సుదామకు దాదాపు అంతే వయసు. పైగా ఆమెకు చూపులేదు. దాదాపు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న వారి ఇంటి ముందు బిక్కుబిక్కుమంటూ ఆకలి బాధతో ఒళ్లంతా కృశించిపోయి వారిని కలిసి మీడియా ప్రతినిధులతో అతికష్టంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారి పరిస్థితి చూసిన ఎవరైనా కళ్లు చెమర్చాల్సిందే.

'మా బిడ్డ మనోజ్‌ ఉద్యోగం కోసం నగరం వెళ్లిపోయాడు. ఎప్పుడోగానీ వస్తాడు వెంటనే వెళతాడు. మాకు తెలుసు వాడు ఇక రాడని. అందరిలాగే వాడికి వయసొచ్చింది.. వెళ్లిపోయాడు' అని చెప్పుకుంటూ ఏడ్చేశారు. ఇలాగే ముసలి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లిపోతున్న మనోజ్‌లు ఇప్పుడు ఉత్తరాఖండ్‌ గ్రామాల్లో కోకొల్లలు. ఉత్తరాఖండ్‌ కొండ ప్రాంతాల నుంచి లక్షల్లో యువత వలస వెళుతున్నారు. ఒక్క పౌరీ జిల్లాలోనే దాదాపు 300 గ్రామాలు వలసల కారణంగా నిర్మాణుష్యంగా మారాయంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా మరికొన్ని గ్రామాలు చెప్పుకుంటూ వెళితే కేసుందర్‌ అనే గ్రామంలో 199మంది ఉండగా వారిలో చాలామంది 50 ఏళ్లు పైబడినవారే.. ఇక అన్సోలి అనే గ్రామంలో 69మందే ఉండగా వారిలో 13మంది మాత్రమే యువకులు ఉన్నారు. ఇక సిరోలి అనే గ్రామంలో 181మంది ఉండగా వారిలో 20మంది మాత్రమే యువకులు. ప్రస్తుతం గ్రామాల్లో బతికే పరిస్థితులు లేకపోవడం, వారికి ఉపాధి లేని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు