ఇక ప్రైవేట్‌ ఆపరేటర్ల చేతికి రైళ్ల నిర్వహణ

19 Jun, 2019 14:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణీకులకు మెరుగైన వసతులు, సౌకర్యాల కల్పనకు కొన్ని రూట్లలో రైళ్ల నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని కేంద్రం యోచిస్తోంది. రైల్వే టికెట్లను విక్రయించే ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రైవేట్‌ సంస్థలను రైళ్ల నిర్వహణకు ఆహ్వానించడం ద్వారా సమకూరే ఆదాయంలో సింహభాగాన్ని రైల్వేలకు ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్ల నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఐఆర్‌సీటీసీ కట్టబెడుతుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

ప్రయాణీకుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్లలోనూ ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానించనున్నారు. రైళ్లలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రయాణీకులకు అంతర్జాతీయ వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రైవేట్‌ నిర్వాహకుల రాక దోహదం చేస్తుందని రైల్వేలు భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై వంద రోజుల్లో పూర్తి ప్రణాళికతో ముందుకు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది.

ప్రీమియం రైళ్ల నిర్వహణను కూడా దశలవారీగా ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగించాలని రైల్వేలు యోచిస్తున్నాయి. మరోవైపు రాజధాని, శతాబ్ధి వంటి ప్రీమియం రైళ్లు లాభాల్లో నడుస్తున్న క్రమంలో ఈ రైళ్ల నిర్వహణకూ ప్రైవేట్‌ ఆపరేటర్లు మొగ్గుచూపుతారని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ సంవత్సరాంతానికి అన్ని స్టేషన్లనూ పూర్తిస్దాయి వైఫై సదుపాయాలతో ఆధునీకరించాలని రైల్వేలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.

మరిన్ని వార్తలు