కేంద్ర ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలు ఖాళీ

10 Sep, 2018 22:34 IST|Sakshi

పదేళ్లలో మూడు రెట్లు పెరిగిన జీతాల ఖర్చు

పథకాల అమలుపై ప్రభావం చూపుతున్న సిబ్బంది కొరత

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2016–17 ఆర్థిక సర్వేలో తేలింది.వీటిలో గుమాస్తా, ఆఫీసు అసిస్టెంట్‌ తరహా ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాల అమలు సంతృప్తికరంగా సాగడం లేదని ఏడవ కేంద్ర వేతన సంఘం తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉంటే మరోవైపు ఉన్న సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం భారీగా సొమ్ము వెచ్చిస్తోంది. 2006–07 నుంచి 2016–17 వరకు అంటే పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతన ఖర్చు మూడు రెట్లు పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది.2006–07 సంవత్సరంలో వేతనాల కోసం కేంద్రం దాదాపు 40వేల కోట్లు వెచ్చించగా,2016–17 సంవత్సరానికది రెండు లక్షల కోట్లకు పెరిగింది.ఈ పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతనాలు మూడు సార్లు పెరిగాయి.

గ్రూప్‌సి ఉద్యోగాలే ఎక్కువ
అమెరికాలో ప్రతి లక్ష మంది ప్రజలకు 668 మంది ఉద్యోగులు ఉండగా, మన దేశంలో లక్ష మందికి 139 మంది ఉద్యోగులే ఉన్నారు. కేంద్ర సంస్థల్లో 2006లో 35 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా, 31 లక్షలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. 4లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయి. అదే 2016 వచ్చే సరికి 36 లక్షల ఉద్యోగాలకు గాను 32 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.ఖాళీ పోస్టుల్లో ఎక్కువ గ్రూప్‌సి ఉద్యోగాలే(గుమాస్తా,ఆఫీసు అసిస్టెంట్‌) ఉన్నాయి. 2016–17లో 32 లక్షల గ్రూప్‌ సి ఉద్యోగాలు మంజూరు కాగా28 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. మిగతా విభాగాలతో పోలిస్తే శాస్త్ర, సాంకేతిక విభాగంలో సిబ్బంది కొరత 50 శాతానికిపైగా ఉంది. 2014లో ఈ విభాగంలో 37శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండగా2016 నాటికది 55శాతానికి చేరింది. పౌర విమానయాన శాఖలో 49శాతం,కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 44శాతం ఉద్యోగాలు భర్తీ కావలసి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా 31శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖల్లో సగటున 25 నుంచి 35 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి.

వేతనాలు పెరిగాయి
ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ప్రజలను ఆకర్షించడం కోసం వారికి ప్రైవేటు సంస్థలతో దీటుగా వేతనాలు ఇవ్వాలని ఏడవ వేతన సంఘం సిఫారసు చేసింది.వేతన సంఘం నివేదికకు అనుగుణంగా సిబ్బంది కనీస వేతనం ఏడు వేల రూపాయల నుంచి 18వేలకు పెరిగింది. ఆ మేరకు మిగతా ఉద్యోగులకు కూడా 157 శాతం వరకు జీతాలు  పెరిగాయి.2015–16 వరకు ఉద్యోగి వేతనంలో మూల వేతనం 36 శాతం ఉంటేl, కరువు భత్యం 42శాతం వరకు ఉండేది.ఏడో వేతన సంఘం సూచన మేరకు 2016–17 నుంచి మూల వేతనం 66శాతం, కరువు భత్యం 16శాతం అయింది.
 

మరిన్ని వార్తలు