ఐదున్నర అడుగుల లోతు వరదలో..

2 Aug, 2019 09:46 IST|Sakshi

అహ్మదాబాద్‌ : అత్యవసర సమయాల్లో కఠినంగా వ్యవహరించడమే కాదు విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించైనా పౌరులకు అండగా నిలుస్తామని నిరూపించారో ఎస్సై. వరదలో చిక్కుకున్న తల్లీ కూతుళ్లను సురక్షితంగా బయటికి తీసుకువచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. గుజరాత్‌లోని వడోదర పట్టణం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో పట్టణ సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎన్నో కుటుంబాలు వరదలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి.

ఈ క్రమంలో వరద మరింత ఉధృతం కానుందన్న సమాచారం నేపథ్యంలో దేవీపురలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. రక్షణ చర్యల్లో భాగంగా తన బృందంతో అక్కడికి చేరుకున్న ఎస్సై గోవింద చద్వాకు మహిళ, ఏడాదిన్నర వయస్సున్న ఆమె బిడ్డ సాయం కోసం అర్ధించడం కనిపించింది. దీంతో పాపను ఓ టబ్‌లో పడుకోబెట్టిన గోవింద తన తలపై ఆమెను మోసుకుంటూ తీసుకువచ్చారు. వరదలో కిలోమీటరున్నర దూరం నడిచి పాపను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. అనంతరం పాప తల్లితో పాటు వరదల్లో చిక్కుకున్న మరికొంత మందిని కూడా కాపాడారు. ఈ క్రమంలో ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. ఇక ఈ విషయంపై స్పందించిన గోవింద ఇదంతా తన విధి నిర్వహణలో భాగమేనని... పాపను రక్షించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు