రెండు దశాబ్దాల తరువాత అసెంబ్లీ బరిలో వైగో!

16 Apr, 2016 19:54 IST|Sakshi
రెండు దశాబ్దాల తరువాత అసెంబ్లీ బరిలో వైగో!

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మే 16 న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు వరాల జల్లును కురిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉంటూ వస్తున్న ఎండీఎంకే నాయకుడు వైగో.. ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు శనివారం ఎండీఎంకే అధికారికంగా ప్రకటించింది. కొవిల్పట్టి నియోజకవర్గం నుంచి వైగో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వైగో చివరిసారిగా 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విలత్తికులమ్ నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం శివకాశి నియోజకవర్గం నుంచి పోటీచేసి రెండు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో విరుధునగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

కెప్టెన్ విజయ్ కాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు సాగుతున్న నాలుగు పార్టీల కూటమి పీడబ్యూఎఫ్ (ప్రజా సంక్షేమ కూటమి)లో భాగస్వామిగా ఎండీఎంకే ఈ దఫా ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఎండీఎంకేకు కేటాయించిన 29 స్థానాల్లో 27 స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. మరో రెండు సీట్లను మాత్రం తమకు అనుబంధంగా ఉన్న చిన్న పార్టీల అభ్యర్థులకు ఎండీఎంకే కేటాయించింది.

అన్ని పార్టీలు ఎవరికి వారే అధికారం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సంక్షేమ కూటమి నేతలైతే మరో అడుగు ముందుకేసి ప్రచార వేదికలోనే ఏ మంత్రి పదవి ఎవరికో తేల్చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. డీఎండీకే యువజన నేత సుదీష్.. ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వైగోకు డిప్యూటీ సీఎం అని ప్రకటించిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు