వాజ్‌పేయిని దింపి.. అడ్వాణీని కూర్చోబెట్టాలని..!

6 Jan, 2017 03:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆప్తమిత్రుడు అడ్వాణీ నుంచే తనకు పదవీగండం ఉందని మాజీ ప్రధాని వాజ్‌పేయి భయపడ్డారా? ప్రధాని పదవి నుంచి తనను తొలగించి అడ్వాణీని నియమించేందుకు కొందరు తెరవెనుక మత్రాం గం చేశారని వాజ్‌పేయి భావించారా? ఈ ప్రశ్నలకు తాజాగా ప్రఖ్యాత జర్నలిస్ట్‌ ఎన్ పీ ఉల్లేఖ్‌ రాసిన ‘ది అన్ టోల్డ్‌ వాజ్‌పేయి: పొలిటీషియన్  అండ్‌ పారడాక్స్‌’ అనే పుస్తకం అవుననే బదులిస్తోంది.ఉపప్రధానిగా అడ్వాణీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తరువాత ఈ కుట్ర జరిగిందని అందులో పేర్కొన్నారు. ఒకరోజు ఒక మంత్రిని తన నివాసానికి పిలిపించుకున్న వాజ్‌పేయి.. ఈ కుట్ర గురించి ఆయనకు చెప్పారని, అందుకు ఆ మంత్రి అంతగా భయపడాల్సిన అవసరం లేదని సమాధానమివ్వగా.. ఈ కుట్రను తాను నమ్ముతున్నానని, అయితే, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలియదని వాజ్‌పేయి పేర్కొన్నారని ఉల్లేఖ్‌ రాశారు.

అంతకు కొన్ని రోజుల ముందే.. వాజ్‌పేయికి రాష్ట్రపతి బాధ్యతలు అప్పగించి.. ప్రధానిగా అడ్వాణీకి అవకాశమివ్వాలని ఆరెస్సెస్‌ చెప్పడాన్నీ ప్రస్తావించారు. గుజరాత్‌ అల్లర్ల సమయంలో నాటి గుజరాత్‌ సీఎం మోదీ పదవి నుంచి దిగిపోవాలని వాజ్‌పేయి బలంగా వాదించారని, అయితే, అలా జరిగితే గుజరాత్‌లో మరిన్ని అల్లర్లు చెలరేగుతాయంటూ అడ్వాణీ అడ్డుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు