గాంధీ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన విద్యార్థి

19 Sep, 2019 19:41 IST|Sakshi

లక్నో: గాంధీ ఈ రెండక్షరాల పేరు వినగానే.. నడుముకు కొల్లాయి, చేతిలో కర్ర, బోసి నవ్వుతో ఓ బక్కపల్చని ఆకారం మన కళ్ల ముందు కనిపిస్తుంది. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యపు అధికారికానికి చరమగీతం పాడించిన వ్యక్తి ఇతనే అంటే నమ్మడం కష్టం. కానీ అహింస, శాంతిని ఆయుధాలుగా చేసుకున్న వ్యక్తి దేన్నైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణగా నిలిచారు గాంధీ. ఆ మహాత్ముడి పేరు వాడుకుని ఓ కుటుంబం మనదేశంలో ఏళ్లకేళ్లుగా అధికారం దక్కించుకుందంటేనే ఆ పేరుకు ఉన్న శక్తి, ఆకర్షణ, గౌరవం ఏలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దేశాన్ని బ్రిటీష్‌ సామ్రాజ్యపు కబంద హస్తాల నుంచి విడిపించి.. స్వేచ్ఛ వాయువులు పీల్చేలా చేసిన బాపును రాజకీయ నాయకులు అధికారం కోసం వాడుకుంటుంటే.. అల్పులు మిడిమిడి జ్ఞానంతో దేశ విభజనకు కారకుడంటూ తెలివితక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. గాంధీ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటి ఈ అల్పుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి ప్రసంగానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వివరాలు.. ఆయుష్‌ చతుర్వేది అనే ఈ కుర్రాడు వారణాసిలోని సెంట్రల్‌ హిందూ బాయ్స్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయుష్‌, గాంధీ గొప్పతనం గురించి ప్రసంగించడమే కాక  నేటి తరం ఆయన విలువలను, నమ్మకాలని ఎలా గాలికి వదిలేస్తుందో వివరించాడు. ‘నాడు బ్రిటీషర్లు గాంధీని రైలులో నుంచి తోసేశారు. కానీ ఏదో ఒక నాడు ఈ వ్యక్తే భారత్‌లో బ్రిటీష్‌ అధికారానికి చరమగీతం పాడతాడని అప్పుడే వారికి తెలిసి ఉంటే.. అలా చేసే వారు కాదు. నేడు చాలా మంది దేశ విభజనకు గాంధీజీనే కారణమని భావిస్తూ.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఆశయాలకు మతం రంగు పులుముతున్నారు’ అన్నాడు.

‘కానీ నాకు తెలిసినంత వరకు గాంధీ కంటే గొప్ప హిందువు మరొకరు లేదు. ఆయన నిత్యం జపించే హే రామ్‌ నినాదం ఏ వర్గాన్ని భయపెట్టదు. ఎందుకంటే భారతదేశంలో లౌకిక వాదానికి గాంధీనే నిలువెత్తు నిదర్శనం’ అంటూ ఆయూష్‌ అనర్గళంగా ఉపన్యసించి మూర్ఖుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. గాంధీ అహింస మార్గాన్ని వదిలేసి కంటికి కన్నుగా వ్యవహరిస్తే.. ప్రపంచమే అంధకారంగా మారుతుందని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి స్పీచ్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు