ఇగ్నో నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న ఖైదీ

10 Aug, 2015 09:22 IST|Sakshi
ఇగ్నో నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న ఖైదీ

న్యూఢిల్లీ: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అన్న చందంగా పదేళ్ల జైలు శిక్ష పడిన ఓ ఖైదీ.. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి బంగారు పతకం సాధించాడు. వారణాసి సెంట్రల్ జైల్లో 2012 ఫిబ్రవరి నుంచి శిక్ష అనుభవిస్తున్న అజిత్ కుమార్ సరోజ్ (23) అనే ఖైదీ ఇగ్నో నిర్వహించిన పర్యాటక విద్యా డిప్లొమాలో ప్రథమస్థానంలో నిలిచాడు. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో అజిత్‌కు పసిడి పతకాన్ని బహూకరించారు.

ఇదే కాకుండా అజిత్ శిక్షాకాలంలో మానవ హక్కులు, విపత్తు నిర్వహణ, ఎన్జీవో మేనేజ్‌మెంట్, ఫుడ్, న్యూట్రిషన్ తదితర కోర్సులు పూర్తి చేశాడు. వీటిలో దాదాపు 65 శాతం పైన మార్కులు తెచ్చుకున్నాడని అధ్యాపకులు అభినందించారు. ఇగ్నోకు సంబంధించి వారణాసి రీజియన్‌లో ఉన్న 20 జిల్లాల్లోని ఆరువేల మంది విద్యార్థుల్లో అజిత్‌కు మాత్రమే గోల్డ్ మెడల్ దక్కడం విశేషమని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు