వరవరరావుపై ఒక్క కేసూ నిలువలేదు

29 Sep, 2018 17:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరేగావ్‌ అల్లర్లకు సంబంధించిన హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన విరసం నేత వరవరరావు, మరో నలుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు పలు అభియోగాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న భారీ అభియోగంతోపాటు నేపాల్, మణిపూర్‌ల నుంచి నక్సలైట్లకు ఆయుధాలను సరఫరా చేయడంలో సహకరిస్తున్నారని, అర్బన్‌ మావోయిస్టుల కార్యకలాపాలకు నిధులిస్తున్నారన్నది ఇతర  అభియోగాలు. ప్రస్తుతం వీరంత గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం 78 ఏళ్ల వరవరరావు గత 48 ఏళ్ల కాలంలో దాదాపు 25 కేసులను ఎదుర్కొన్నారు. ఏ ఒక్క కేసుల్లోనూ ఆయన దోషిగా తేలలేదు. ఆయనపై అన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఒక్క 2005 సంవత్సరంలోనే వరవరరావుపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. చిలకలూరిపేట, అచ్చంపేట పోలీసు స్టేషన్లపై నక్సలైట్ల దాడి, ఒంగోలు వద్ద ఓ సీనియర్‌ పోలీసు అధికారి కాన్వాయ్‌పై నక్సలైట్ల దాడి, బాలానగర్‌లో ఓ పోలీసు కాల్చివేత సంఘటనల నేపథ్యంలో వరవరరావుపై ఈ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించిన చిలుకలూరి పేట పోలీసు స్టేషన్‌పై దాడికి నక్సలైట్లను వరవర రావు రెచ్చగొట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి డైరెక్షన్‌ ఇచ్చారని, ఇందులో ఇతర విరసం సభ్యుల పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ఆరోపణ. పోలీసు స్టేషన్‌ పేల్చివేతకు నక్సలైట్లకు సెల్‌ఫోన్‌ ద్వారా డైరెక్షన్‌ ఇచ్చినట్లు సబ్‌ డివిజనల్‌ స్థాయి పోలీసు అధికారి స్వయంగా ఆరోపణలు చేశారు.

ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించిన అచ్చంపేట పోలీసు స్టేషన్‌పై దాడిని కూడా వరవరరావు ప్రోత్సహించారని మరో కేసు దాఖలు చేశారు. ముగ్గురు పౌరుల మరణానికి దారితీసిన ఒంగోలు సమీపంలో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి వరవరరావుతోపాటు మరో విరసం నేత కళ్యాణ్‌రావు బాధ్యులని నేరారోపణలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లను విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న వరవరరావు ఇంట్లో జరిగిన రహస్య సమావేశంలో తాము పాల్గొన్నట్లు ఆ ఇద్దరు నక్సలైట్లు వెల్లడించారు. వరవరరావు కుట్ర కారణంగానే కానిస్టేబుల్‌ను కాల్చివేసిందనేది మరో కేసు.

ఈ కేసుల్లోని లొసుగులను మీడియా పట్టుకొని వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో పోలీసులు విచారణకు ముందే మూడు కేసులను ఉప సంహరించుకున్నారు. ఒంగోలులో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో మాత్రం వరవరరావుపై కొన్నేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఆ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. హత్యలకు, హత్యాయత్నాలకు ప్రోత్సహించారని, రెచ్చగొట్టారంటూ అంతకుముందు దాఖలైన నాలుగు కేసులు కూడా కోర్టు ముందు నిలబలేక పోయాయి.

ఆయుధాల సరఫరా కేసులు
ఆయుధాల డీలర్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయుధాల చట్టం–1959, పేలుడు పదార్థాల చట్టం–1908, కింద వరవర రావుపై  దాదాపు తొమ్మిది కేసులను దాఖలు చేశారు. 1985లో ఆర్‌ఎస్‌యూ విద్యార్థి లాకప్‌ మరణానికి నిరసనగా చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయడం కోసం వరవరరావు స్వయంగా బాంబులు పంచారన్నది కూడా ఓ కేసు. 1974 నాటి సికిందరాబాద్‌ కుట్ర కేసు, 1986 నాటి నామ్‌నగర్‌ కుట్ర కేసు వీటిలో ప్రధానమైనవి. హత్య, హత్యాయత్నాలు, దోపిడీలను ప్రోత్సహించడం, కుట్ర పన్నడంతోపాటు దేశద్రోహం అభియోగాలను కూడా ఆయనపై మోపారు. వీటిలో ఏ ఒక్క కేసు కూడా కోర్టు ముందు నిలబడలేదు. దాదాపు ఇప్పుడు కూడా ఆయనపై ఇలాంటి కేసులనే పుణె పోలీసులు దాఖలు చేశారు. మావోయిస్టు కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తున్నారన్నది కాస్త కొత్త కేసు. 1998లో కాలేజీ అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసి, పింఛను డబ్బులతో బతుకుతున్న వరవరరావు, మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆయన కుటుంబ సభ్యుల ప్రశ్న. ఇదివరకటిలా ఈ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా విడుదలవుతారని వారు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు