సంపన్న ఎంపీలకు వేతనం ఎందుకు..?

7 Aug, 2018 16:12 IST|Sakshi
బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

లక్నో : రాజకీయ నాయకులంటే మాటలకే పరిమితం కాదని ఆచరణలో చూపారు బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ. గత తొమ్మిదేళ్లుగా సుల్తాన్‌పూర్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ తన వేతనాన్ని విరాళంగా ఇచ్చేస్తూ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. గతంలో ఆయన సుల్తాన్‌పూర్‌లో ఓ రైతుకు రూ 2.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. కర్ణావటి యూనివర్సిటీలో ఇటీవల విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించిన వరుణ్‌ గాంధీ సంపన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతాలను వదులుకోవాలని తాను చేసిన విజ్ఞప్తిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ 25 కోట్లు మించి ఆస్తులను ప్రకటించిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికి తాను లేఖలు రాశానని, చట్ట సభ సభ్యుడిగా మీకు వచ్చే వేతనాలను మీరు ఎందుకు వదిలివేయకూడదని తాను కోరానని ఆయన చెప్పుకొచ్చారు. మనం ఇలా చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ 480 కోట్లు మిగులుతాయని ఇది పెద్ద మొత్తమేనని వారికి వివరించానన్నారు. తన లేఖకు బదులుగా ఏ ఒక్కరి నుంచి ప్రత్యుత్తరం రాలేదని చెప్పారు. తాను ఈ ప్రతిపాదనను తేవడంపై కొందరు ఎంపీలు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

మరిన్ని వార్తలు