కాంగ్రెస్‌లోకి వరుణ్‌ గాంధీ..?

28 Nov, 2017 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ: తన సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి. వరుణ్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వరుణ్‌ గాంధీకి ముఖ్యమంత్రి అయ్యే నాయకత్వ లక్షణాలున్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కావాలనే ఆయనను పక్కన పెట్టిందని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనంతరం ముఖ్యమంత్రిగా వరుణ్‌ పేరును ప్రకటిస్తారని బీజేపీ కార్యకర్తలు అనుకున్నారని యూపీ కాంగ్రెస్‌ నాయకుడు జమీలుద్దీన్‌ చెప్పారు. కానీ, బీజేపీ నాయకత్వం యోగి ఆదిత్యనాథ్‌కు ఆ పదవిని కట్టబెట్టిందన్నారు. వరుణ్‌కు ఫాలోయింగ్‌ ఉన్నా ఆయనను కీలక స్థానంలో కూర్చొబెట్టడం ఇష్టం లేకే బీజేపీ ఇలా చేసిందని వ్యాఖ్యానించారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోకి చేరతారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మంజూర్‌ అహ్మద్‌ జోస్యం చెప్పారు. రాహుల్‌, వరుణ్‌లు ఇరువురూ కలసి కాంగ్రెస్‌ను ముందుకు నడిపిస్తారని అన్నారు. ప్రియాంక వాద్రాతో వరుణ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వరుణ్‌ను పార్టీలోకి తీసుకురావడంలో ఆమె కీలకపాత్ర పోషించనున్నారని వెల్లడించారు.

మరోవైపు రాజకీయ నిపుణులు మాత్రం వరుణ్‌ కాంగ్రెస్‌లో చేరబోరని అంటున్నారు. బీజేపీ కేబినేట్‌లో మనేకా గాంధీ ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అంతేకాకుండా సోనియా గాంధీకి మనేకా కుటుంబంతో విభేదాలు కూడా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు