నువ్వు ఏదో ఒకరోజు సీఎం అవుతావు!

17 Dec, 2018 18:27 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. చరిత్రాత్మక ఆల్బర్ట్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాజస్తాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా, వసుంధర రాజేల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

వసుంధర రాజే, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ కూడా రాజవంశీకులన్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా సింధియాను పలకరించిన రాజే.. రాజవంశీకుల ఆచారం ప్రకారం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో... రాజకీయ పరంగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ రక్తసంబంధీకుల మధ్య ఉన్న ఆప్యాయతల్లో ఎటువంటి తేడా ఉండదు అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ అంటూ వీరి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గాసిప్‌ రాయుళ్లు మాత్రం...’ ఈ వేడుకలో భాగంగా మేనత్త వసుంధర.. తన మేనల్లుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనందపడుతూనే.. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా మధ్యప్రదేశ్‌ సీఎం అవుతావంటూ ఆశీర్వదించి ఉంటారు’  అంటూ కథనాలు అల్లేస్తున్నారు కూడా.

కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్‌ సంఘ్‌ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్‌ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్‌ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు.

మరిన్ని వార్తలు