టాపర్‌గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు

27 May, 2020 08:37 IST|Sakshi

పట్నా : చదువుకు డబ్బుతో సంబంధం లేదనే విషయం మరోసారి రుజువైంది. కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు బిహార్‌ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు. ఓవైపు తండ్రికి సాయంగా ఉంటూనే.. మరోవైపు చదువులో మెరుగైన ఫలితాలు సాధించిన అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ మంగళవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 15.29 లక్షల మంది హాజరవ్వగా.. 12.4 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

ఈ పరీక్ష ఫలితాల్లో రోహ్తాస్ జిల్లాలోని జనతా హైస్కూల్‌కు చెందిన హిమాన్ష్‌ రాజ్‌ టాపర్‌గా నిలిచాడు. 500 మార్కులకు గానూ హిమాన్ష్‌ 482 మార్కులు సాధించాడు. కాగా, హిమాన్ష్‌ తండ్రి కూరగాయల అమ్మకం సాగిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో హిమాన్ష్‌ టాపర్‌గా నిలవడంతో.. అతని స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే హిమాన్ష్‌ రోజుకు 14 గంటల పాటు చదువుకుంటూనే.. కూరగాయల షాప్‌లో తన తండ్రికి సాయం కూడా చేసేవాడని తెలిసింది. హిమాన్ష్‌కు చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఉందని, చాలా తెలివైనవాడని అతని ఉపాధ్యాయులు తెలిపారు. కాగా, ఇంజనీర్‌ కావాలన్నదే తన లక్ష్యమని హిమాన్ష్‌ చెప్పాడు.

మరిన్ని వార్తలు