రూ కోటి చేతికి అందినట్టే అంది..

12 Jun, 2018 11:56 IST|Sakshi

సాక్షి, ముంబై : కష్టాన్ని నమ్ముకుని బతికే సుహాస్‌ కదమ్‌ లాటరీలో రూ కోటికి పైగా గెలుచుకున్నాడని తెలియగానే ఇక తన కష్టాలు తీరాయనుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన 44 ఏళ్ల సుహాస్‌ కదమ్‌ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన బతుకు మారుతుందనే ఆశతో గత ఐదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఉన్నట్టుండి లాటరీలో రూ కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందడంతో కదమ్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. నలసపరకు చెదిన కదం తాను లాటరీలో గెలుచుకున్న బహుమతి మొత్తం వసూలు చేసుకునేందుకు లాటరీ విభాగానికి వెళ్లగా ఒకే ప్రైజ్‌ను ముగ్గురు వ్యక్తులు తామే గెలుచుకున్నామని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు.

సరైన టికెట్‌తో వచ్చిన వ్యక్తికి లాటరీ బహుమతిని అప్పగించామని వారు కదమ్‌తో చెప్పారు. తాను కొన్న టికెట్‌ నకిలీదని లాటరీ డిపార్ట్‌మెంట్‌ తేల్చిచెప్పడంతో నిరుత్సాహానికి లోనైన కదమ్‌ నగరంలోని మహాత్మా ఫూలే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గుర్తింపు కలిగిన కేంద్రాల్లోనే నకిలీ టికెట్లు ఎలా అమ్ముతున్నారో బట్టబయలు చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. తన బంధువులు సైతం లాటరీలో తాను గెలుపొందినందుకు అభినందనలు తెలిపిన క్రమంలో జరిగిన పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నకిలీ లాటరీ టికెట్ల ముద్రణ, పంపిణీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు