భారీగా పెరగనున్న కూరగాయల ధరలు

2 Jun, 2018 13:02 IST|Sakshi

న్యూఢిల్లీ : తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు. పంటకు కనీస మద్దతు ధరతో పాటు రైతులకు రుణమాఫీ, స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలంటూ ఏడు రాష్ట్రాల్లో రైతులు నిరసన ఉ‍ద్యమాలు చేపట్టారు. 10 రోజుల వరకు నిర్వహించనున్న ఈ నిరసనలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి.  పాలు, కూరగాయల సరఫరాను రైతులు పూర్తిగా నిలిపేశారు. నిరసనలో భాగంగా పాలను రోడ్లపై పారబోశారు. కూరగాయలను రోడ్డుపై పడేశారు.  రైతుల నిరసనతో మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 

పాలు, కూరగాయలు, పళ్లు తీసుకుని పట్టణాలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణాల్లో కూరగాయల ధరలు, పాల ధరలు మండిపోతున్నాయి. 10రోజులపాటు సమ్మెకు దిగడంతో కూరగాయలు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తీవ్ర కొరత తప్పదని, ఈ ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. 10 రోజుల వరకు పాల నుంచి పచ్చిమిర్చి దాకా అన్నింటిన్నీ బంద్ చేస్తామని రైతులు కూడా తేల్చి చెప్పేశారు. రైతుల నిరసనలతో మొదటి రోజే కూరగాయలు, పాల సరఫరా 50 శాతం వరకు పడిపోయింది. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల రైతులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 10న భారత్ బంద్‌ను కూడా రైతులు చేపట్టనున్నారు. 
 

మరిన్ని వార్తలు