‘అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి’

5 Nov, 2019 19:24 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం పంబ సన్నిధిలో టోల్‌ ఫ్రీ సర్వీస్‌ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాసరావు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సూచించారు. శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేరళ సీఎం ఆహ్వానం మేరకు  ఈ రోజు(మంగళవారం) ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవదాయశాఖ మంత్రులతో జరిగే ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతినిధిగా వెళ్లారు. 

ఈ సమావేశంలో కేరళ సీఎం, దేవాదాయ మంత్రికి ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి వెల్లంపల్లి కొన్ని అంశాలు ప్రతిపాదించారు. అవి.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాముల కోసం కేరళ ప్రభుత్వాన్ని శబరిమలైలో  కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి  స్థలం కేటాయించమని కోరినట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పోలీసులు, అధికారులతో కలిసి నీలకంఠ, పంబ బేస్‌ క్యాంపు వద్ద శబరిమల సమాచార వ్యవస్థతోపాటు తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. పంబ మార్గంలో ప్రయాణించే బస్సు బోర్డులను తెలుగు భాషలో ఏర్పాటు చేయాలని సూచించారు. అయ్యప్ప భక్తులకు నీలకంఠ, పంబ సన్నిధి వద్ద తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, అల్పాహార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై కేరళ సీఎం స్పందిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట ప్రభుత్వాల హెల్ప్‌ డెస్క్‌లకు అనుసంధానిస్తూ కేరళలో సెంట్రల్‌ హెల్ప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కనకదుర్గ అమ్మవారి ప్రసాదము అందజేసి వారిని సన్మానించారు. అనంతరం పద్మనాభ స్వామిని మంత్రి దర్శించుకొని ఆశీర్వాదములు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు