వ్యవసాయరంగంలో మార్పులు అవసరం : ఉపరాష్ట్రపతి

17 Jan, 2019 20:09 IST|Sakshi

వనరుల కేటాయింపులో వ్యవసాయం పట్ల సానుకూల పక్షపాతం చూపించాలి

పంటమార్పిడి, అచరణీయమైన సాంకేతికత వ్యవసాయ రంగ అభివృద్ధికి కీలకం

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలి

అగ్రి విజన్ – 2019 ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

సాక్షి, హైదరాబాద్‌:  వ్యవసాయ రంగం మీద సానుకూలమైన పక్షపాతాన్ని చూపుతూ, వనరుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వ్యవసాయాన్ని స్థిరమైన మరియు లాభసాటి రంగంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఈ రంగంలో నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. హైదరాబాద్ లో జరిగిన అగ్రివిజన్ 2019 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఉత్పాదకత క్షీణించడం, సహజ వనరుల లభ్యత తగ్గిపోవడం, ఆహారం కోసం వేగంగా పెరుగుతున్న గిరాకీ, వ్యవసాయ ఆదాయాలు తగ్గిపోవడం, వ్యవసాయ భూమి తగ్గుతుండడం, వాతావరణ మార్పులు లాంటి ఎన్నో సవాళ్ళను భారతీయ వ్యవసాయరంగం ఎదుర్కోంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయరంగంలో వృద్ధిరేటు పెరుగుదల కీలకమన్న ఉపరాష్ట్రపతి, ఈ రంగం సాధికారత ద్వారా పేదరికాన్ని తగ్గించడమే గాక, ఈ రంగానికి అనుబంధంగా ఉన్న రంగాల్లో లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. భారతదేశ జిడిపిలో వ్యవసాయ రంగానిది 18 శాతమని, అదే సమయంలో దేశంలో 50 శాతం మందికి ఉపాధిని అందిస్తోందని తెలిపారు. 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు, శాస్త్రీయ సమాజం, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, మరియు రైతుల సంయుక్త ప్రయత్నాలు అవసరమని పిలుపునిచ్చారు. 

అవగాహన ద్వారా వృధాను అరికట్టవచ్చు
వ్యవసాయ రంగంలో సంస్కరణల ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టిందని, ఈ నేపథ్యంలో రైతులు సాంకేతికతకు మరింత చేరువయ్యి నీటిపారుదల సదుపాయాలు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల పెంపకం, కనీస మద్ధతుదర పెరుగుదల వంటి వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల మీద కూడా దృష్టి పెట్టాలన్నారు.  వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కలవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి చొరవ ఎగుమతులకు ఆస్కారంతో పాటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు సాయపడతాయని , రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ లో అవగాహన ద్వారా వృధాను అరికట్టవచ్చని తెలిపారు. రైతు ఆదాయాన్ని పెంచేందుకు మార్కెట్ తో వారికి సత్సంబంధాలు కీలకమని, సన్నకారు రైతులకు ఆ అవకాశాలు ఉండడం లేదని, 85 శాతం మంది రైతులు ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ-నామ్ లాంటి పద్ధతుల ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చని అన్నారు.

సవాళ్లను అధిగమించడం కీలకం
భారతదేశం ఆహారదిగుమతి మీద ఆధారపడి లేదని, స్వీయ ఆహారభద్రత మనకు కీలకమన్న ఉపరాష్ట్ర,  వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, సమర్థవంతమైన సంస్థాగత సంస్కరణలతో పాటు, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఆహార, పోషకాహార భద్రతతో సహా వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సవాళ్ళను అధిగమించడం కీలకమని అభిప్రాయ పడ్డారు. వాతావరణ పరిస్థితులను అధిగమించే దిశగా వ్యవసాయంలో మార్పులు రావాలని, ఉత్పాదకతను పెంచేందుకు నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన లాంటి వాటి గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు కృషి చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు.

మరిన్ని వార్తలు