-

ఈ మూడు లక్షణాలు ఉంటే విజయం మీదే : వెంకయ్యనాయుడు

22 Nov, 2018 19:53 IST|Sakshi
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రసంగిస్తున్న భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

రాజకీయ నాయకుడిగా రాణించాలనుకుంటున్నారా..? స్టార్‌ పొలిటిషియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందా..? అయితే మీలో..  గ్లామర్‌, గ్రామర్‌, హ్యూమర్‌ అనే మూడు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలట. ఈ మాటలు చెబుతోంది మేము కాదండోయ్‌!

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్‌ అండ్ అవార్డ్స్ 2018’  కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే గ్లామర్‌, గ్రామర్‌, హ్యూమర్‌ అనే లక్షణాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మూడు లక్షణాలు విడివిడిగా ఉంటే సరిపోవని.. అన్నీ కలగలిసి ఉన్నప్పుడే మీపై వదంతులు ప్రచారమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చమత్కరించారు. కాగా ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, తమిళనాడు సీఎం పళని స్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్ సహా పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

ఇక ఇండియా టుడే అవార్డుల్లో భాగంగా... పాలనలో అత్యంత మెరుగైన రాష్ట్రంగా ఎన్నికైన తెలంగాణ తరపున తెలంగాణ భవన్ ప్రధాన రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్వీకరించారు.

మరిన్ని వార్తలు