'అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం'

9 Dec, 2015 13:28 IST|Sakshi
'అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం'

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై బుధవారం లోక్సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ  కేసులో ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదికగా ప్రభుత్వంపై దాడికి దిగింది. అయితే ప్రభుత్వం కూడా కాంగ్రెస్పై ఎదురు దాడి చేసింది.

ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభమవడమే ఆలస్యం... కాంగ్రెస్ ఎంపీలు నేషనల్  హెరాల్డ్ వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునే యత్నం చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఆందోళన మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళన విరమించాలని, సభ సజావుగా సాగాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు.

ఈ  సందర్భంగా విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ...ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానాలో కాంగ్రెస్ నేతలపై అక్రమంగా సీబీఐ కేసులు నమోదు చేస్తుందన్నారు. దేశంలో రెండు చట్టాలు అమలవుతున్నాయని... అధికార పక్షానికి ఓ చట్టం... విపక్షానికి మరో చట్టం అమలవుతుందని ఎద్దేవా చేశారు. అయితే సీబీఐ, ఈడీ కేసులకు మాత్రం భయపడేది లేదని ఖర్గే స్పష్టం చేశారు. ఇంతలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ఖర్గే వాఖ్యలకు ఖండించారు.

కోర్టు కేసులను రాజకీయం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కోర్టు కేసులకు... ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో అమిత్ షాను జైలుకు పంపిన సంగతిని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. కక్ష సాధించడం కాంగ్రెస్ పార్టీకే అలవాటు అని ఆయన అన్నారు. సభ సజావుగా జరగడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఒకరిని వేధించాల్సిన అవసరం తమకు లేనే లేదని ఆయన  స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు