రిపీట్‌ కావొద్దు : వెంకయ్య నాయుడు

19 Jul, 2019 18:20 IST|Sakshi

న్యూఢిల్లీ : పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బుధవారం నాటి ఎజెండాలో మంత్రి పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సభాపతి స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...‘ మంత్రి గారు.. మొన్నటి ఎజెండాలో మీ పేరు ఉంది. కానీ మిమ్మల్ని పిలిచినపుడు అందుబాటులో లేరు. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి’ అని బలయాన్‌తో వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన మంత్రి గైర్హాజరీ పట్ల విచారం వ్యక్తం చేశారు.

కాగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కెబినెట్‌ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం, మరికొంతమంది​ తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడం పట్ల మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకానీ మంత్రుల పేర్లను తనకు అందజేయాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని ఆదేశించారు.

మరిన్ని వార్తలు