-

వెంకయ్యా.. ఇదేందయ్యా..!

23 Apr, 2018 11:49 IST|Sakshi
వెంకయ్య నాయుడు, ప్రశాంత్ భూషణ్ (ఫైల్ ఫొటో)

సీజేఐపై అభిశంసన తీర్మాణం నోటీసు తిరస్కరించిన వెంకయ్య

అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మాన నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్ణయంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరగా.. సోమవారం వాటిని వెంకయ్య నాయుడు తిరస్కరించిన అనంతరం ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఉపరాష్ట్రపతికి నేతలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులు సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పడం మాత్రమే వెంకయ్య పని అని, తిరస్కరించే అధికారం లేదని అభిప్రాయపడ్డారు. 

'తన వద్దకు తీర్మానం నోటీసులలో 50 మంది కంటే ఎక్కువ ఎంపీలు సంతకాలు చేశారా లేదా అన్నది చూడాలి. అసలు ఏ విషయం ఆధారంగా తీర్మానాన్ని వెంకయ్య తిరస్కరించారు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు. ముగ్గురు జడ్జీలతో కమిటీ నియమించాలని ఎంపీలు నోటీసులలో కోరారు. కానీ అభిశంసన తీర్మానాన్ని తీరస్కరించడం సరైన నిర్ణయం కాదని' ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్‌ సహా ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసులను వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సంతకం చేసిన ఎంపీలకు తమ కేసుపై వారికే కచ్చితత్వం లేదని, ఆరోపణలకు సంబంధించి జరిగి ఉండొచ్చు.. అవకాశముంది.. పాల్పడొచ్చు అనే పదాలను ఉపయోగించారని వెంకయ్య నాయుడు తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులను తిర్కరించినట్లు వివరించారు.
 

మరిన్ని వార్తలు